హుజురాబాద్ ఉప ఎన్నిక చాలా ఖరీదైనది కాబోతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం ఖాళీ అయ్యింది సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామాతో. ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరో కాదు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. మంత్రి పదవి నుంచి గెంటివేయబడ్డాక, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితిలోంచి బీజేపీలోకి వచ్చేశారు. త్వరలో ఉప ఎన్నిక జరగాల్సి వుంది హుజూరాబాద్ నియోజకవర్గానికి.
ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాన్ని రాజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, తద్వారా తెలంగాణ సెంటిమెంటుని రగిల్చారు. అంతేనా, ఉద్యోగాల భర్తీకి తెరలేపారు. హుజూరాబాద్ నియోజకవర్గానికీ వరాల జల్లు కురిపించేస్తున్నారు. ఇదంతా ఓ యెత్తు.. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వస్తే, ఆ తర్వాత మొదలయ్యే హంగామా ఇంకో యెత్తు.
ఈటెల రాజేందర్ అంచనా ప్రకారం, హుజూరాబాద్ కోసం అధికార టీఆర్ఎస్ రికార్డు స్థాయిలో ఖర్చు చేయబోతోందట. నిజమే, ఏ రాష్ట్రంలో ఉప ఎన్నిక వచ్చినా, అధికార పార్టీ రికార్డు స్థాయిలోనే ఖర్చు చేస్తుంటుంది. ఇది ఓపెన్ సీక్రెట్. దుబ్బాకలో ఎంత ఖర్చు చేసినా టీఆర్ఎస్ గెలవలేకపోయింది. కానీ, నాగార్జునసాగర్‌లో గులాబీ పార్టీ సత్తా చాటింది. హుజూరాబాద్‌లో ఏమవుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
గులాబీ పార్టీ మాత్రమే కాదు, బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా హుజూరాబాద్ నియోజకవర్గంలో కనీ వినీ ఎరుగని రీతిలో ఖర్చు చేయనున్నాయన్నది నిర్వివాదాంశం. కాంగ్రెస్‌లో వుండే, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి టిక్కెట్ హామీ పొందిన ఓ నాయకుడు, ఏకంగా ఓటుకి 5 వేలు ఖర్చు చేయడానికి తాను సిద్ధమన్నట్లు ప్రకటించడం.. దానికి సంబంధించిన ఆడియో టేప్ బయటకు రావడం.. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రాధాన్యత చెప్పకనే చెబుతోంది. ప్రజాస్వామ్యమంటే, పార్టీలు గెలవడమంటే.. ఓటన్లను, కరెన్సీ నోట్లతో కొనాల్సిందే కదా.?