Crime News: ప్రస్తుత కాలంలో యువతీ యువకులు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దానిని ధైర్యంగా ఎదుర్కోవలసింది పోయి క్షణికావేశంలో ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. చిన్న చిన్న సమస్యలకు కూడా మనస్థాపం చెంది నిండు నూరేళ్ల తమ జీవితాలను ఇలా అర్ధాంతరంగా ముగిస్తున్నారు. భర్త వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆడ పిల్లలు పుట్టడమే ఆ తల్లి చేసిన నేరమా.. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని భర్త వేధింపులకు తట్టుకోలేక మానసికంగా మానసికంగా కుంగిపోయిన యువతి ఆత్మహత్య శరణ్యమనుకొని కన్న బిడ్డలను వదిలి అనంత లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా,పాలకొండ పట్టణం లో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన గారమ్మ కాలనీ 6వ లైన్‌కు చెందిన ప్రియాంక అనే యువతి బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రియాంకకు 2019లో టెక్కలి పట్టణానికి చెందిన సొదై కిరణ్ తో వివాహం జరిగింది.2020లో ప్రియాంకకు తొలికాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇటీవల రెండో కాన్పులో మరో ఆడపిల్ల పుట్టింది. అప్పటివరకు హాయిగా సాగిపోతున్న వారి సంసారంలో అందరూ ఆడపిల్లలే పుట్టారని భర్త తరచూ ప్రియాంకను వేధింపులకు గురి చేసేవాడు.ముగ్గురు ఆడపిల్లల బాగోగులు చూసుకునేందుకు అదనపు కట్నం కావాలంటూ అత్తింటివారు వేధింపులకు గురిచేశారు. ఈ క్రమంలో పుట్టింట్లో ఉన్న ప్రియాంక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.