సోషల్ మీడియాపై ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం ఎంతవరకు సబబు.? అన్నది ఓ కీలకమైన చర్చ. అదే సమయంలో, సోషల్ మీడియాలో జుగుప్సాకరమైన రాతలెంతవరకు సబబు.? అన్నది ఇంకో చర్చ. అదీ కీలకమైనదే..ఇదీ కీలకమైనదే. జుగుప్సాకరమైన రాతలపై ప్రభుత్వాలు కొరడా ఝుళిపించాల్సిందే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
కాగా, కేంద్రం ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా వేదికలకు షాకుల మీద షాకులు ఇస్తోంటే, రాష్ట్రాలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. గతంలో నమోదైన పలు కేసులకు సంబంధించి ఆయా సోషల్ మీడియా వేదికలకు నోటీసులు పంపడంలో పోలీసు వ్యవస్థ బిజీ అయిపోతోంది.
మరీ ముఖ్యంగా సెలబ్రిటీలపై అత్యంత జుగుప్సాకరమైన వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో వారిని కించపర్చిన నెటిజన్ల తాట తీసే దిశగా పోలీసులు అడుగులేస్తున్నారట. పనిలో పనిగా రాజకీయాలకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా వచ్చిన అసత్య ప్రచారంపై కొరడా ఝుళిపించేందుకూ పోలీసులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు ఈ దిశగా కార్యాచరణ సిద్ధం చేయడంతో.. గతంలో చేసిన పాపాలకు అతి త్వరలో సదరు నెటిజన్లు శిక్ష అనుభవించక తప్పేలా లేదు. నిజానికి, ఈ సోషల్ మీడియా వేధింపులకు దాదాపు అందరు రాజకీయ నాయకులూ బాధితులే. సినీ సెలబ్రిటీల సంగతి సరే సరి. అయితే, పార్టీలకతీతంగా ఈ విచారణలు జరుగుతాయా.? కొందరికి మాత్రమే శిక్షలు పడతాయా.? అన్నదానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి. ఏమో, ఏం జరుగుతుందోగానీ.. సోషల్ మీడియా క్లీన్ స్పేస్ అయితే అంతకన్నా కావాల్సిందేముంది.?