అసలు ఆనందయ్య ఎక్కడ.? ఆయనేం చేస్తున్నారు.? ఆనందయ్య ‘నాటుమందు’ తాజా పరిస్థితి ఏంటి.? అది ఎవరెవరికి అందుతోంది.? అన్న విషయాలపై తీవ్ర గందరగోళం వుంది. రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించడంలేదంటూ ఆనందయ్య ఈ మధ్యనే వ్యాఖ్యానించారు. మరోపక్క వైసీపీకి చెందిన కొందరు నేతలు, ఆనందయ్య మందు పేరుతో రకరకాల మందుల్ని జనాల్లోకి వదిలేశారు. దాదాపుగా ఆంధ్రపదేశ్‌లోని అన్ని జిల్లాల్లోనూ ఆనందయ్య నాటు మందు పేరుతో పంపిణీ కార్యక్రమాలు నడుస్తున్నాయి.
వీటిపై ప్రభుత్వ పర్యవేక్షణ కన్పించడంలేదు. ఆనందయ్య నాటు మందులో హానికారకమైనవి ఏమీ లేవు గనుక.. ఆ విషయమై ప్రభుత్వం చేయడానికి కూడా ఏమీ లేదు. అయితే, తాజాగా ఆనందయ్య నాటు మందుకి సంబంధించి షాకింగ్ ట్విస్ట్ తెరపైకొచ్చింది. ఆనందయ్య తయారు చేస్తున్న మందుల్లో చుక్కల మందు కీలకమైనది. ఈ మందు పంపిణీ విషయమై కొన్ని అనుమానాలు తలెత్తడంతో మందు పంపిణీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. రకరకాల పరీక్షల అనంతరం, ఈ మందులో హాని కలిగించే పదార్థం వుందని తేలిందట. ఈ విషయాన్ని ప్రభుత్వం, తాజాగా హైకోర్టుకి తెలిపింది. దాంతో ఆ నివేదికల్ని తమ ముందుంచాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో తదుపరి విచారణ జులై 1కి వాయిదా పడింది. చుక్కల మందుని ఆయుష్ కేంద్రంలో పరీక్షించాలని పిటిషనర్ కోరడం గమనార్హమిక్కడ. నిజానికి, ప్రభుత్వమే అన్ని రకాల ఈ మందుని పరీక్షించి, ప్రజలకు అందించాలని అనుకున్నా.. తెరవెనుక చాలా రాజకీయం జరిగింది. రెండు పార్టీల మధ్య గొడవగా మారిపోయింది. దాంతో, అధికార పార్టీ ఈ తలనొప్పులు తమకెందుకని లైట్ తీసుకున్నటుగా భావించాలేమో. ఇదిలా వుంటే, ఆనందయ్య నాటు మందు కారణంగా కరోనా తగ్గిందన్న అధికారిక సమాచారం అయితే ఇంతవరకు లేదు.