దాదాపుగా ప్రతిరోజూ ఆంధ్రఆంధ్పప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు ఆ పైన నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతోందో చెప్పడానికి ఇదొక నిదర్శనం మాత్రమే. మరోపక్క, కరోనా టెస్టుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మామూలుగా అయితే, కేసుల సంఖ్య పెరుగుతున్నప్పుడు, దాంతోపాటే, టెస్టుల సంఖ్య కూడా పెరగాలి. టెస్టుల సంఖ్య లక్ష దాటేశాయి ఓ సందర్భంలో. అయితే, అవి మళ్ళీ 80 నుంచి 90 వేలకు తగ్గిపోవడం గమనార్హం. ఇంకోపక్క, రాష్ట్రంలో ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాలు (తిరుపతి ఘటన, అనంతపూర్, కర్నూలు, విజయనగరం జిల్లాల్లోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సమస్యలు) కరోనా బాధితుల్లో ఆందోళన పెంచుతున్నాయి.. సాధారణ ప్రజానీకం కూడా భయాందోళనలకు గురవుతున్నారు.
పొరుగు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పిస్తుండడం, బాధితులకు బరోసా ఇచ్చేందుకు కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు కరోనా కట్టడి కోసం సమీక్షలు నిర్వహించడం.. ఇలా ప్రభుత్వ పెద్దలు ఎంతలా ప్రయత్నిస్తున్నా, కింది స్థాయిలో చిన్న చిన్న లోపాలు.. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఇవన్నీ ఓ ఎత్తు.. వ్యాక్సినేషన్ ఇంకో ఎత్తు. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ చేయించగలిగే సామర్థ్యం వున్నప్పటికీ, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం, కేంద్రాన్ని ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నిలదీయలేకపోవడం పెద్ద సమస్యగా మారుతోంది. వ్యాక్సిన్ ఒక్కటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నుంచి ప్రజల్ని రక్షించగలుగుతుంది. కానీ, ఆ వ్యాక్సిన్ అందాల్సిన స్థాయిలో అందడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కట్టడి ఎలా.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే.