YS Vivekanda Reddy : సీబీఐ విచారణ కొనసాగుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడంతోనే, సీబీఐ రంగంలోకి దిగిందా.? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ కేసు విచారణను సీరియస్‌గా తీసుకోలేకపోయింది.? వంటి ప్రశ్నలు ఎప్పటికప్పుడు తెరపైకి వస్తూనే వున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి డెత్ మిస్టరీ.. ఎప్పటికి వీడుతుందోగానీ.. ఈలోగా రకరకాల ఊహాగానాలు పుడుతుంటాయ్.. వాటిని మనం చూస్తూనే వుంటాం.
అత్యంత కిరాతకంగా వైఎస్ వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికి వుంటుంది.? అన్న ప్రశ్న చుట్టూ ఇప్పటిదాకా బోల్డన్ని అనుమానాలే తప్ప, సరైన సమాధానం దొరకడంలేదు, దొరుకుతుందన్న నమ్మకమూ కనిపించడంలేదు. గొడ్డలితో వృద్ధుడైన వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా హతమార్చడం వెనుక ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు వున్నాయో ఏమో. కసితీరా వివేకానందరెడ్డిని చంపేశారన్నది మాత్రం నిర్వివాదాంశం.
రక్తపు మరకల్ని తుడిచేసి, హత్యను కాస్తా గుండెపోటుగా చిత్రీకరించేందుకు జరిగిన ప్రయత్నం మరింత దుర్మార్గం. దీనంతటికీ కారణం కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. అనే ప్రచారం జరుగుతోంది. సీబీఐ కూడా ఇదే విషయాన్ని తన చార్జిషీటులో పేర్కొంది. అయితే, ఈ ఆరోపణని వైసీపీ ఖండిస్తోంది.
దస్తగిరి, శంకరయ్య, ఎర్ర గంగిరెడ్డి.. ఇలా చాలా పేర్లు ఈ కేసులో అత్యంత కీలకంగా మారాయి. సీఐ శంకరయ్య పోలీస్ అధికారి. ఆయన ఇచ్చిన సమాచారంలో కూడా అవినాష్ రెడ్డి సహా పలువురు ఈ కుట్రలో బాగమనే తేలుతోంది. దస్తగిరి వాంగ్మూలం సంగతి సరే సరి. అయితే, ఇవన్నీ న్యాయస్థానాల్లో ఎంతవరకు నిలబడగలవన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావొస్తున్న వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడకపోవడం ఆశ్చర్యకరమే. కేసు విచారణ సీబీఐ చేపడుతోందిగనుక, విచారణ జాప్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నిందించాల్సిన అవసరమే లేదన్నది వైసీపీ వాదనగా కనిపిస్తోంది.
ఏమో, ఎవరు బాధ్యత వహిస్తారో.. ఎప్పటికి కేసు తేలుతుందోగానీ.. మాజీ మంత్రి హత్య కేసులో దోషులకు శిక్ష పడకపోవడం మాత్రం అత్యంత దారుణం.