హైదరాబాద్ టైమ్స్ ప్రతి సంవత్సరం మోస్ట్ డిసైరబుల్ మెన్, ఉమెన్ జాబితాలను ప్రకటిస్తూ ఉంటుంది. అన్ని రంగాల్లోని సెలబ్రిటీలకు ప్రజల్లో ఉన్న ఆదరణను బేస్ చేసుకుని ఈ జాబితా తయారుచేస్తారు. ఆయా రంగాల్లో యాక్టివ్ గా ఉన్నవారే ఈ జాబితాలో చోటు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ 2020 జాబితాలో మాత్రం శృతి హాసన్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో నెంబర్ వన్ స్ధానంలో నిలబడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే శృతి హాసన్ గత రెండు మూడేళ్లు తెలుగులో సినిమాలే చేయలేదు.
2019, 2020 లో ఆమె టాలీవుడ్లో సందడే చేయలేదు. ఒక దశలో ఆమె టాలీవుడ్ పరిశ్రమను వదిలేసిందేమో అనుకున్నారు అందరూ. లాంగ్ గ్యాప్ తర్వాత 2021లో క్రాక్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. 2019, 2020లలో టాలీవుడ్లో బాగా హడావుడి చేసిన హీరోయిన్లు పూజా హెగ్డే, రష్మిక మందన్న. అలాగే నిధి అగర్వాల్, నభ నటేష్ కూడ సందడి చేశారు. వీరందరి కాదని మూడేళ్లు కనబడకుండా గాయబ్ అయిన శృతి హాసన్ ఎలా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది అనేదే సోషల్ మీడియా జనాలకు సైతం అర్థంకాని విషయమైంది