వైసీపీ నేతలు కోర్టుల మీద ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో రాష్ట్రం మొత్తం చూసింది. జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు రావడంతో మొత్తం న్యాయవ్యవస్థ మీదనే ఆగ్రహం వ్యక్తం చేశారు వారు. జగన్ నిర్ణయాలు తప్పని చంద్రబాబు అనడం ఆయన అన్నట్టే కోర్టు నుండి మొట్టికాయలు పడటం జరగడంతో చంద్రబాబు కోర్టులను మేనేజ్ చేస్తున్నారని లేకపోతె తీర్పులు ముందుగానే ఆయనకు ఎలా తెలిసిపోతున్నాయని, జడ్జీలు చంద్రబాబుతో కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై జగన్ సుప్రీమ్ ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అసలు కోర్టులతో వైసీపీ నేతలకు ఇంత కయ్యం ఏర్పడటానికి కారణం చంద్రబాబే.
ప్రభుత్వం ఏ విషయంలో అయితే కోర్టుకు వెళుతుందో ఆ విషయంలో ఫలితం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వస్తుందని చంద్రబాబు చేప్పడం, తీర్పు అలాగే ఉండటం, దాన్ని పట్టుకుని బాబుగారు ముందే చెప్పాను కదా అన్నట్టు నవ్వడం జగన్ కు అస్సలు నచ్చలేదు. తిట్టినప్పుడు కాదు పక్కనోడు నవ్వినందుకు కోపం అన్నట్టు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తిన్నందుకు కాదు కానీ చంద్రబాబు ఎద్దేవా చేసినందుకే జగన్ ఆగ్రహానికి లోనయ్యారు. అందుకే కోర్టులను బ్లేమ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ భావన లేదు వారిలో. కోర్టు తీర్పులు వారికి అమితానందాన్ని ఇస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం జగన్ పదవి నుండి తప్ప్పుకోవాలని ఎవరో పిటిషన్ వేస్తే కోర్టు చీవాట్లు పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసింది.
ఈ తీర్పుతో వైసీపీ నేతల్లో ఉత్సాహం పెరిగింది. గతంలో ఏ కోర్టులను అయితే తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, చంద్రబాబు ఆడించినట్టు ఆడుతున్నాయని అన్నారో ఇప్పుడు అదే కోర్టులను న్యాయాన్ని కాపాడారు, ఈ తీర్పు న్యాయవ్యవస్థ మీద నమ్మకం, గౌరవం పెరిగేలా చేశాయని పొగడ్తలు కురిపిస్తున్నారు. అంతేకాదు మూడు రాజధానుల విషయంలో కూడ ప్రభుత్వానికి అనుకూలమైన్ తీర్పు వస్తుందని ధీమాగా చెబుతున్నారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పాలన్ వికేంద్రీకరణకు సిద్ధమైందని అన్నారు.
న్యాయపరమైన చిక్కులన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ధీమాగా చెబుతూ మూడు రాజధానుల కోసం ప్రభుత్వం వైపు అన్ని చర్యలు పూర్తయ్యాయని సజ్జల వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోతాయని ఆయన అంటుండటం చూస్తే గతంలో కోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఆర్డర్ కొత్త సీజే వచ్చాక జరగబోయే విచారణలో ఎత్తివేయబడుతుందని, రాజధానిగా విశాఖకు అన్ని అనుమతులు వచ్చేస్తాయని, రైతుల పోరాటాలు ఏవీ పనిచేయవన్నట్టు మాట్లాడారు. ఒకవేళ ఆయన అన్నట్టే నాలుగు నెలల్లో కోర్టులో విశాఖ రాజధానిగా అమలయ్యేలా అనుకూల తీర్పు వస్తే ఏమనుకోవాలి. సజ్జలకు కోర్టు తీర్పు ముందే ఎలా తెలిసింది. కొత్త సీజే రాగానే చిక్కులు తొలగిపోతాయని ఆయన ఎలా ఊహించారు. అంటే గతంలో చంద్రబాబు చేసినట్టే కోర్టులను మేనేజ్ చేయడం జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం చేయాలేమో అంటున్నారు కొందరు.