నర్సాపురం పార్లమెంట్ స్థానం నుండి గెలిచిన రఘురామ కృష్ణంరాజు ఆ తర్వాత వైసీపీ పార్టీతో విభేదించి పార్టీకి దూరంగా ఉంటూ , వ్యతిరేక కార్యక్రమాలు, విమర్శలు చేస్తూ ముందుకి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మొన్నటి ప్రెస్ మీట్ లో అసలు తాను వైసీపీ లోకి రావటానికి కారణమేంటి..? తనను బలవంతం చేసి పార్టీలోకి తీసుకోని వచ్చింది ఎవరు ..? అనే విషయాలు గురించి వివరంగా చెప్పుకొచ్చాడు.
2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ నన్ను కలిసి కచ్చితంగా ఈ ఎన్నికల్లో నర్సాపూర్ నుండి పోటీచేయాలని, మీరు తప్ప ఇంకెవరు ఆ స్థానం నుండి గెలవలేరని నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు . విధి రాత కావచ్చు, నా కర్మ కావచ్చు వైసీపీ లో చేరిపోయాను. నేను చేరిన వెంటనే నన్ను కాదని, ఆ స్థానంలో మరొకరిని పోటీకి దించాలని వైసీపీలోని కీలక నేత భావించి, జగన్ ను ఒప్పించాడు. అయితే ప్రశాంత్ కిషోర్ దీనికి అభ్యంతరం వ్యక్తం చేసి, నేను రఘురామని కస్టపడి ఒప్పించి తీసుకోని వస్తే మీరు ఇలా చేయటం మంచి పద్దతి. ఇలాగైతే నేను పనిచేయటం కష్టమని చెప్పటంతో, ఇక వాళ్ళకి మరో ఛాన్స్ లేక నాకు టిక్కెట్ ఇచ్చారు. నేను ఎలాగూ ఓడిపోతాననే అనుకున్నారు. నిజానికి నా రాజకీయ పారాణి ఆరకముందే నన్ను వైసీపీ పార్టీ నుండి బయటకు పంపించాలని అనుకున్నారు,కానీ ప్రశాంత్ కిషోర్ వలన ఆగిపోయారంటూ, అసలు విషయం చెప్పుకొచ్చాడు రఘురామ కృష్ణంరాజు.
ఆయన మాటల్లో చాలా వరకు నిజమే ఉందని తెలుస్తుంది. మొదటి నుండి విజయసాయి రెడ్డికి, రఘురామకి పొసగటం లేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. దానికి తోడు ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డి కంటే రఘురామకే కేంద్ర ప్రభుత్వ పెద్దలు గౌరవం ఇవ్వటం కూడా విజయసాయి రెడ్డికి సుతారం ఇష్టం లేదని, రఘురామను ఇలాగే కొనసాగిస్తే రేపొద్దున ఢిల్లీలో తనకే పోటీగా వస్తాడని భావించి అతన్ని పంపే కార్యక్రమం మొదలుపెట్టాడంటూ కొందరు విశ్లేషకులు చెప్పే మాట. అయితే ఇందులో రఘురామ తప్పు కూడా లేకపోలేదు. పార్టీ తరుపున గెలిచినప్పుడు దాని నిబంధనలకు అనుకూలంగా ఉండాలి. కుదరకపోతే గౌరవంగా పక్కకు తప్పుకోవాలి కానీ, అధినేత పరువును, పార్టీ పరువును బజారులో పెట్టి తమాషాలు చేయకూడదు