కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన ఇండియన్ హాకీ.!

ఒలింపిక్ పోటీల్లో హాకీకి సంబంధించి ఇంకా భారతదేశానిదే రికార్డ్. హాకీ అంటే, దేశంలో మరుగున పడిపోయిన జాతీయ క్రీడ. ఔను, చాలాకాలంగా భారతదేశంలో హాకీ అనే గొప్ప క్రీడకు ప్రాధాన్యత దక్కుతూ వచ్చింది. క్రికెట్ మీద వున్నంత అభిమానం, హాకీ మీద లేకుండా పోయిందన్నది నిర్వివాదాంశం. హాకీ ఆడేవాళ్ళే కాదు, హాకీ చూసేవాళ్ళు కూడా గణనీయంగా తగ్గిపోయారు. కానీ, ఇకపై ఆ పరిస్థితి వుండకపోవచ్చు. ఓ వైపు మహిళా హాకీ, ఇంకో వైపు పురుషుల హాకీ.. రెండు విభాగాల్లోనూ కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. పురుషుల హాకీ జట్టు, బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. మహిళా టీమ్ ఏం చేస్తుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. నిజానికి, రెండు జట్లూ గోల్డ్ మెడల్ మీదనే ఫోకస్ పెట్టాయి. కానీ, అదృష్టం కలిసి రాలేదంతే. ఆట అన్నాక గెలుపోటములు సహజం. క్రికెట్ పరంగా చూసుకున్నా, మరో ఆట పరంగా చూసుకున్నా.. ఫెయిల్యూర్స్ సర్వ సాధారణం.

కానీ, క్రికెట్ విషయంలో సరిపెట్టకుంటాం.. హాకీ విషయంలో ఎగతాళి చేస్తాం. ఇకపై ఎవరూ హాకీ విషయంలో ఎగతాళి చెయ్యడానికి వీలుండకపోవచ్చు. అయితే, ఇక్కడ ప్రభుత్వాలే కీలక పాత్ర పోషించాలి. హాకీ క్రీడ పట్ల యువతరంలో, చిన్నారుల్లో ఆసక్తి పెరిగేలా చేయాలి. దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. అన్నిటికీ మించి, హాకీ ఆడేందుకు దేశవ్యాప్తంగా సౌకర్యాలు మెరుగుపర్చాలి. హాకీ ఒక్కటే కాదు, బాక్సింగ్ సహా అనేక పోటీల్లో భారత ఆటగాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలోని మేటి ఆటగాళ్ళకూ తీసిపోరు. ఇక్కడ కావాల్సిందల్లా ఆవకాశాలివ్వడం, ప్రోత్సహించడం. ఆటల్లోకి రాజకీయాలు జొప్పించకుండా, నిజమైన టాలెంట్ వెలికి వచ్చేలా ప్రభుత్వాలు చేయగలిగితే, 140 కోట్ల మంది జనాభా వున్న దేశం నుంచి వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది మంది క్రీడా ఆణిముత్యాలు వెలుగులోకి వస్తాయ్.