వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అంటే శ్రీకాకుళం రాజకీయాల్ని శాశించే సత్తా ఉన్న నాయకుడు. టీడీపీ కంచుకోటైన సిక్కోలు జిల్లాలో ఆ పార్టీ నేతల్ని ఢీ కొట్టి గెలవగల బలమైన నేత. జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లోనూ ప్రసాదరావు చురుకుగా పావులు కదపగల నాయకుడిగా ఓ ముద్ర వేసారు. కాంగ్రెస్ హయాంలోనే ధర్మాన బలమైన నాయకుడిగా ఎదిగారు. అయితే అన్నయ్య ధర్మాన కృష్ణదాస్ మాత్రం రాజకీయాల్లో అంత యాక్టివ్ పర్సన్ కాదన్నది చాలా మందికి తెలిసిందే. తమ్ముడు వల్ల కృష్ణదాస్ రాజకీయ నాయుడు అయ్యారు తప్ప! లేదంటే? రాజకీయాల్లోకి ఆయన వచ్చే వారు కాదని జిల్లా వాసులే చెబుతుంటారు.
ఇటీవలే కృష్ణదాస్ మంత్రి నుంచి ఉపముఖ్యమంత్రిగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ధర్మాన ప్రసాద్ రావు తిరుగుబాటు ఉదృతం చేస్తే పరిస్థితి ఏంటని భావించే? జగన్ మోహన్ రెడ్డి– కృష్ణదాస్ కి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారన్నది కొంత మంది వాదన. జగన్ కి ఇప్పుడు ధర్మాన బ్రదర్స్ అవసరం ఎంతైనా ఉంది. శ్రీకాకుళంలో వైసీపీ బలంగా పాతుకుపోవాలంటే ప్రసాద్ రావు అండ కచ్చితంగా ఉండాల్సిందే. పార్టీలో ప్రసాదరావుకి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి పదవులు గట్రా ఇవ్వకుండానే ఆయనకు చేయాల్సిందల్లా బ్యాకెండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఉపముఖ్యమంత్రి హోదాలో కృష్ణదాస్ ఉన్నా జిల్లా లో స్థానిక నేతల కోసం ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. జిల్లా ఇంచార్జ్ పదవులకు గానీ, ఇతర అవసరాలేవి కృష్ణదాస్ తీర్చలేకపోతున్నారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కృష్ణ దాస్, తమ్ముడు ధర్మాన ప్రసాదరావులా సొంత నిర్ణయాలు తీసుకోలేరని కొందరంటే? నిర్ణయాలు తీసుకునేంత స్వేచ్ఛ జగన్ మోహన్ రెడ్డి ఇవ్వలేదన్నది మరికొత మందివాదన. మరి వీటికి కృష్ణదాస్ ఎలా పుల్ స్టాప్ పెడతారో.