లాక్ డౌన్ తరవాత కోలుకున్న ఏకైక సినీ ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. రెండు నెలలు వంద శాతం ఆక్యుపెన్సితో నడిచి నాలుగైదు హిట్ సినిమాలను అందుకుంది. అంతేకాదు ఈ నాలుగైదు నెలల గ్యాప్లో సుమారు ఐదారు పాన్ ఇండియా సినిమాలను అనౌన్స్ చేశారు మనవాళ్ళు. ఇదిలా వుంటే హిందీ పరిశ్రమ ఇంకా కష్టాల్లోనే ఉంది. లాక్ డౌన్ తర్వాత కూడ థియేటర్లు తెరుచుకోలేదు. కొత్త సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు.సల్మాన్ ఖాన్ సైతం ఓటీటీకి వెళ్లాల్సి వచ్చింది.ఇక స్టార్ హీరోలు కొత్త సినిమాలను ఒప్పుకోవట్లేదు. ఇక మీడియం రేంజ్ హీరోల సంగతి చెప్పనక్కర్లేదు. వాళ్లకసలు సినిమాలే లేవు.
పైగా అందరి దృష్టి సౌత్ సినిమా మీదనే ఉంది.ఇక్కడి దర్శకులతో వర్క్ చేయాలని వాళ్ళు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే మన హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు చేయడానికి ఆసక్తిగా ఉంటున్నారు. అందునా ప్రభాస్ సినిమా అంటే మరీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ చేస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్ర చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ‘సలార్’ చిత్రంలో కూడ హిందీ హీరోనే ప్రతినాయకుడిగా నటిస్తాడని తెలుస్తోంది. అతను ఎవరో కాదు జాన్ అబ్రహం. జాన్ అబ్రహం సైతం ‘సలార్’ ఆఫర్ పట్ల ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. మొత్తానికి హిందీ హీరోలు ప్రభాస్ కు విలన్లు అయిపోతున్నారు.