వైసీపీ సర్కారుకు న్యాయస్థానాల్లో వరుస దెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ భవనాలకు రంగులు, నిమ్మగడ్డ తొలగింపు లాంటి కేసుల్లో ఇప్పటికే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రాగా ఆ తీర్పులను ప్రభుత్వం అయిష్టంగానే పాటించింది. అయితే ఇవన్నీ చిన్నా చితకా వ్యవహారాలే కావడంతో ప్రభుత్వత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ అతి ముఖ్యమైన పేదల ఇళ్ల పట్టాల పంపిణీ అంశంలో మాత్రం హైకోర్టులో వ్యతిరేక తీర్పులు రావడాన్ని వైఎస్ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. కారణం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్ బలంగా సంకల్పించారు. ఈ పథకం అమలు కోసం మొదటి నుండి చాలా కష్టపడుతున్నారు.
భారీగా భూసేకరణ జరిపి 26 వేల ఎకరాలు సేకరించి వాటిలో లేఔట్లు వేశారు. ప్రభుత్వం ఇస్తున్న ఈ భూములను పేదలు ఆవసరం వచ్చినప్పుడు తిరిగి అమ్ముకునేలా హక్కును కల్పించాలని జగన్ ప్రధాన ఉద్దేశ్యం. అంటే ప్రభుత్వం నుండి పేదలకు సొంత ఆస్థి ఇవ్వడం. సుమారు 30 లక్షల మందికి భూములు ఇవ్వాలని అనుకుని ల్యాటరీ ద్వారా తొలిదశలో 15 లక్షల మందిని ఎంపిక చేసి పట్టాలు ఇవ్వాలని ప్లాన్ చేశారు. ఈ పథకాన్ని గనుక అమలుచేయగలిగితే జగన్ చరీష్మా రెట్టింపు అవుతుంది. అందుకే జగన్ ఈ పట్టాల పంపిణీ మీద బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఉచితంగా ఇచ్చే భూముల మీద విక్రయించే హక్కు ఇవ్వకూడదనే నియమం ఉండటంతో హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఇంకా ఆ పిటిషన్లు విచారణకు రాలేదు కాబట్టి ఆగష్టు 15న జరపాలనుకున్న పట్టాల పంపిణీ వాయిదా పడింది.
ఇది చాలదన్నట్టు ప్రకాశం జిల్లా సర్వేరెడ్డిపాలెం, యర్రజెర్ల, కందులూరు, మర్లపాడు, కొణిజేడు గ్రామాల పరిధిలోని ఖనిజ, పశువుల మేతకు కేటాయించిన భూముల్లో 1307 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై హైకోర్టు స్టే ఇచ్చింది. మైనింగ్ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదని అంటూ కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ మేరకు మైనింగ్ భూములను పట్టాలుగా ఇవ్వరాదు. ఈ నిబంధనలో ఎలాంటి పొరపచ్చాలకు తావులేదు. కాబట్టి ఈ భూములను సేకరణ నుండి మినహాయించాల్సిందే. అలా చేస్తే 1307 ఎకరాల్లో ఎవరికైతే పట్టాలు ఇవ్వాలని అనుకున్నారో వారికి భూములు అందవు. జగన్ ఆలోచనకు ఇది పెద్ద సంకటమే. ఇదే ఆయనలో కంగారును కలిగిస్తోందని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.