తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మంత్రి పదవి కోల్పోయిన ఈటెల రాజేందర్, ఈ భూ కబ్జా వ్యవహారంపైనా, ప్రభుత్వ పెద్దల వేధింపులపైనా న్యాయపోరాటం చేస్తామని ప్రకటించిన విషయం విదితమే. ఈటెల కుటుంబానికి చెందిన జమున హేచరీస్ తాజాగా హైకోర్టను ఆశ్రయించింది. కేసు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రికి రాత్రి ఎలా విచారణ పూర్తయ్యిందో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఇంట్లోకి చొరబడి విచారణ చేస్తారా.? అని కూడా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయడం గమనార్హం. అయితే, ప్రాథమిక విచారణ మాత్రమే జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది.
దాంతో, ప్రభుత్వ డొల్లతనం బయటపడిందనీ, కేవలం ఈటెల రాజేందర్ మీద రాజకీయ వేధింపుల్లో భాగంగానే ‘భూ కబ్జా’ ఆరోపణలు తెరపైకొచ్చాయనే చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కాగా, దేవరయాంజల్ ఆలయ భూముల వివాదంలోనూ ఈటెల రాజేందర్ ‘టార్గెట్’ అయ్యేలానే వున్నారు. కేవలం ఈటెల కోసమే, ఈ పాత వ్యవహారాన్ని మళ్ళీ ప్రభుత్వం కొత్తగా తెరపైకి తెచ్చిందని ఈటెల అభిమానులు అంటున్నారు. ఈటెల రాజేందర్ తప్పు చేశారా.? లేదా.? అన్నది విచారణలో తేలుతుందో తేలదో కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, ఇలాంటి చాలా కేసులు ఏళ్ళ తరబడి నడుస్తూనే వుంటాయి. రాజకీయంగా ఆయా వ్యక్తులకు లాభం కలిగించేందుకో, నష్టం కలిగించేందుకో మాత్రమే ఈ తరహా కేసులు వెలుగు చూస్తుంటాయన్నది రాజకీయ పరిశీలకుల భావన. గతంలో బోల్డన్ని సంఘటనలు ఇలాంటివి జరిగాయి, జరుగుతూనే వున్నాయి. మరోపక్క, ఈటెల రాజేందర్ మీద విమర్శలు చేసేందుకు అధికార పార్టీ నేతలు ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు. ఈటెలను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అధిష్టానంపై ఒత్తడితెస్తున్నారు.