మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడుకు హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐకి సంబంధించిన మందుల కొనుగోళ్లు విషయంలో భారీ కుభకోణం జరిగింది. అందులో అచ్చెన్నాయుడు ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన సంతకం పెట్టడం వలనే కుంభకోణం జరిగిందని ఆధారాలు ఉండటంతో గత నెల 12న తెల్లవారుఝామున ఇంటికి వెళ్ళి మరీ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ జరిగే సమయంలో ఆపరేషన్ జరిగి ఉండటంతో మొదట ఆసుపత్రికి, అక్కడ చికిత్స అనంతరం జైలుకు, ఈమధ్యే కోర్టు ఉత్తర్వులతో గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్నారు.
ఈ కేసులో ఇంతకుముందే అచ్చెన్నాయుడు వేసిన బెయిల్ పిటిషన్ మీద కోర్టు విచారణ చేపట్టింది. అచ్చెన్నాయుడు తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరాం వాదనలు వినిపించారు. ఇరువురి వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి తీర్పును రిజర్వులో పెట్టారు. అనుమానితులు బెయిల్ మీద బయటకు వెళితే సాక్ష్యాలు తారుమారవుతాయనే ఏసీబీ తరపు వాదన వైపే హైకోర్టు మొగ్గు చూపింది. అందుకే అచ్చెన్నాయుడుకి బెయిల్ దొరకలేదు.
ఆయనతో పాటు ఏ1 రమేష్ కుమార్, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఏ మురళి, మరో నిందితుడు సుబ్బారావు పిటిషన్లను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో రూ.988 కోట్ల కొనుగోళ్లు జరిగాయని, అందులో రూ.150 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఎసీబీ దర్యాప్తు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు సిఫార్సు మేరకు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు జరిగినట్లు ఆరోపణలు ఉండగా టీడీపీ మాత్రం ఇది తప్పుడు కేసు అని, అసలు నిలబడదని, అచ్చెన్నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వాదించింది. మరి అంత బలహీనమైన కేసే అయితే బెయిల్ దొరక్కపోవడం అసంభవం. కానీ దొరకలేదంటే కేసు గట్టిగా ఉందని, అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని రుజువైంది.