ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులకి ఏపీ హైకోర్టు శిక్ష, జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని తీర్పునిచ్చిన కోర్టు ఆయనకు శిక్ష, జరిమానా వేసింది. హైకోర్టు పనిగంటలు ముగిసే వరకు కోర్టు హాలులోనే కూర్చోవాలని గురువారం వెల్లడించింది. దీంతో పాటు రూ.1,000 జరిమానా కూడా చెల్లించాలని సూచించింది. ఒకవేళ జరిమానాను చెల్లించడంలో విఫలమైతే ఏడు రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది.
వాస్తవానికి అసెంబ్లీ కార్యదర్శికి నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించారు. అయితే… తన వయసు, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెసులుబాటు కల్పించాలని బాలకృష్ణమాచార్యులు కోర్టుకు విన్నవించుకున్నారు. భవిష్యత్తులో కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో మరింత జాగ్రత్త వహిస్తానని హామీ ఇచ్చారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి మానవతాదృక్పథంతో తీర్పును సవరించారు.
అసెంబ్లీలో పనిచేసే ఔట్‌సోర్సింగ్ సిబ్బంది పిటిషనర్లు/టైపిస్టులు, ఆఫీసు అసిస్టెంట్లకు ఇంక్రిమెంట్లు, జీతాల విషయమై 2017 ఫిబ్రవరిలో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఆ ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో సిబ్బంది కోర్టుధిక్కరణ కింద వ్యాజ్యాలు దాఖలు చేశారు. గతంలో దీనిపై విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం.. తీర్పును వెలువరించలేదు. శిక్ష విధించే నిమిత్తం గురువారానికి ఈ కేసును వాయిదా వేశారు. గురువారం జరిగిన విచారణలో జస్టిస్ దేవానంద్ తీర్పును వెల్లడించారు.