అనుకున్నట్టుగానే జరిగింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలయిన రోజే హౌస్ లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. హౌస్ లో పలు బిల్లులపై చర్చ నడుస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
అయితే.. తుఫాను వల్ల నష్టపోయిన రైతుల తరుపున తాను మాట్లాడుతానని చంద్రబాబు అనుమతి కోరారు. స్పీకర్ తమ్మినేని.. తాను మాట్లాడుతానంటే అనుమతి ఇవ్వలేదని.. టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి స్పీకర్ పోడియం వద్దకు చేరుకొని బైఠాయించారు.
దీంతో సభా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. వెంటనే మంత్రి పేర్ని నాని.. ఇలా పోడియం ముందు బైఠాయించి.. సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నందున.. వాళ్లందరినీ సస్పెండ్ చేయాలని కోరారు. దీంతో స్పీకర్ తమ్మినేని 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో సహా.. చంద్రబాబును కూడా హౌస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే.. ఈ సస్పెన్షన్ సోమవారం నాటికే వర్తిస్తుందని స్పీకర్ వెల్లడించారు.