హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. మహా అయితే ఆరేడేళ్లు. ఎవరో కాజల్, తమన్నా, అనుష్క, నయనతార లాంటి కొద్దిమంది హీరోయిన్లకు తప్ప దశాబ్దం పైబడి కెరీర్ కొనసాగించే ఆస్కారం అందరికీ రాదు. అందుకే చాలామంది దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఫార్ములాను ఫాలో అవుతారు. ఉన్న ఐదారేళ్ళ ఒక వెలుగు వెలిగి రాబట్టుకోవాల్సిందంతా రాబట్టుకోవాలి అన్నట్టు వ్యవహరిస్తుంటారు. అందుకే సినిమాలతో పాటే సైన్ ఇన్కమ్ మీద కూడ దృష్టి పెడతారు. వాణిజ్య ప్రకటనలతో పాటు ఓపెనింగ్ ఈవెంట్స్ కోసం ఎదురుచూస్తుంటారు.
వస్త్ర, బంగారు వ్యాపారాల్లో ఉండే చాలామంది వ్యాపారస్తులు కొత్తగా ఏర్పాటుచేసిన తమ షోరూమ్స్ ఓపెనింగ్ కోసం హీరోయిన్లను సంప్రదిస్తుంటారు. హీరోయిన్ స్టార్ డమ్ ను బట్టి 15 లక్షలు, 10 లక్షలు, 7 లక్షలు, 5 లక్షలు అంటూ\ పెద్ద మొత్తాలు చెల్లించి ప్రారంభోత్సవ కార్యక్రమాలకు డేట్స్ తీసుకుంటుంటారు. కాజల్, సమంత, పూజా హెగ్డే, తమన్నా, శ్రియ, మెహ్రీన్ కౌర్ మొదలుకుని నిన్న మొన్న వచ్చిన ఫరియా అబ్దుల్లా లాంటి కొత్త హీరోయిన్లు అందరూ ఈ ఆఫర్లను బాగా అందిపుచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది చిన్న హీరోయిన్లకు సినిమాల్లో వచ్చే ఆదాయం కంటే ఈ రిబ్బన్ కటింగ్ వేడుకల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంటుంది. అందుకే ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి కార్యక్రమాలకు మాత్రం టైమ్ కేటాయిస్తుంటారు.
కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కరోనా దెబ్బతో వ్యాపార రంగాలు డీలాపడ్డాయి. కొత్త బ్రాంచెస్ పెట్టడమనే ఆలోచనే చెయ్యట్లేదు చాలామంది. ఒకవేళ పెట్టినా లక్షలు పోసి హీరోయిన్లను తీసుకొచ్చి ఓపెనింగ్ ఈవెంట్స్ చేసే పరిస్థితులు అసలే లేవు. దీనిమూలంగా చాలామంది హీరోయిన్ల ద్వితీయ ఆదాయ మార్గాలు మూసుకుపోయాయి. వీటికి తోడు కొత్త సినిమాలు మొదలవ్వక అవకాశాలు కూడ తగ్గుముఖం పట్టాయి. ఇలా అన్ని వైపుల దారులు మూసుకుపోవడంతో హీరోయిన్ల ఆదాయం భారీగా పడిపోయింది.