ఆ హీరో సైకిలెందుకు ఎక్కాడు చెప్మా.?

 
ఓ ప్రముఖ హీరో సైకిలెక్కాడు.. అదీ ఓటు వేసేందుకోసం. ఇప్పుడీ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమయ్యింది. కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్, ఇంట్లో గ్యాస్ సిలెండర్ కి నమస్కారం చేసి, ఎన్నికల్లో ఓటెయ్యడానికి వెళ్ళినట్లు పేర్కొన్నారు. వంట గ్యాస్ ధర పెరగడం పట్ల నిరసన అది. గతంలో నరేంద్ర మోడీ, అప్పటి యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకోసం ఉపయోగించిన పొలిటికల్ స్టంట్ ఇది. ఆయన చెప్పిన వ్యవహారమే.. ఇంట్లో గ్యాస్ బండకి నమస్కారం చేసి ఓట్లెయ్యండి.. అని మోడీ చెప్పిన దాంట్లో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటెయ్యమనే అర్థం దాగి వుంది. మరి, తమిళ సినీ నటుడు విజయ్ ఎందుకు సైకిల్ మీద ఓటెయ్యడానికి వెళ్ళినట్లు.? ఇంకెందుకు, పెరిగిన పెట్రో ధరల పట్ల నిరసన వ్యక్తం చేయడానికి. ఇప్పుడీ వ్యవహారం తమిళనాట పెను ప్రకంపనలకు కారణమయ్యింది. విజయ్ బోల్డంత ఫాలోయింగ్ వున్న నటుడు తమిళ సినిమాల్లో.
 
తమిళ రాజకీయ తెరపై పదే పదే విజయ్ పేరు వినిపిస్తుంటుంది. విజయ్ ఎవర్ని టార్గెట్ చేసుకున్నాడు.? అన్నది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ఇంకెవరికి అధికారంలో వున్న అన్నాడీఎంకే, దాని మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలని బహుశా విజయ్, తమిళ ఓటర్లకు పిలుపునిస్తున్నాడేమో. ఎంతైనా తమిళనాట వున్న రాజకీయ చైతన్యం అంతా ఇంతా కాదు. ఆ రూటే సెపరేటు. పెట్రో ధరల మంటకు కేంద్ర ప్రభుత్వమే కారణం. అత్యంత దారుణంగా ప్రజల నడ్డి విరుస్తోంది మోడీ సర్కార్, పెట్రో ధరల పెంపుతో. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ప్రభావం అన్ని రంగాలపైనా పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయంటే, దానిక్కారణం పెట్రో మంటే మరి. పెట్రో ధరలు పెరిగితే, రవాణా ఛార్జీలు పెరుగుతాయి.. తద్వారా అన్ని ధరలూ పెరగాల్సిందే మరి.