Telangana: తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ..!

తెలంగాణ వాతావరణం మరోసారి భయపెడుతోంది. గత వారం వరదలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీలుస్తుండగా, వాతావరణ శాఖ మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే ఆకాశం మబ్బులతో నిండిపోగా, పలు జిల్లాల్లో మళ్లీ వర్షాలు ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల పరిధిలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు ఇచ్చింది.

గురువారం మెదక్ జిల్లాలో మూడున్నర గంటల వ్యవధిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో గాంధీనగర్ కాలనీని వరదనీరు ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని హయత్ నగర్‌లో 9 సెంటీమీటర్ల వర్షం రికార్డు అయింది. వర్షంతో రహదారులు చెరువుల్లా మారిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లపై పడుతోంది. వరద ఉధృతి పెరగడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ నుంచి 460 క్యూసెక్కుల వరద, హిమాయత్ సాగర్ నుంచి 1350 క్యూసెక్కుల వరద నీరు విడుదల అవుతోంది. పరిస్థితులు మరింత తీవ్రతరమైతే గేట్ల సంఖ్యను పెంచే అవకాశం ఉందని జలమండలి అధికారులు వెల్లడించారు.

భారీ వర్షాల సమయంలో అనవసర ప్రయాణాలు మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాగులు, వంకల దగ్గరికి వెళ్లకూడదు. విద్యుత్ స్తంభాల దగ్గర జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిస్తున్నారు. ఈనెల 15 వరకు వర్షాల దాడి కొనసాగే అవకాశం ఉండటంతో అధికారులు రాత్రింబవళ్ళు మానిటరింగ్ చేస్తున్నారు. మరోసారి భారీ వర్షాలు రాష్ట్రాన్ని కుదిపే సూచనలు కనిపిస్తున్నాయి.