హైదరాబాద్ లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగరంలో కొన్ని ఏరియాల్లో ఈదురు గాలుతో కూడిన వర్షం పడింది. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడ్డ నగర వాసులు వర్షంతో చిల్ అయ్యారు. అయితే విచిత్రంగా ఈ వర్షం హైదరాబాద్ లో కొన్ని ఏరియాల్లోనే పడింది. మరికొన్ని ఏరియాల్లో ఆకాశం నుంచి ఒక్క డ్రాప్ కూడా పడలేదు. ఖైరతాబాద్, సోమాజీగూడ, పంజాగుట్ట, కోటి, బేగం బజార్, అబిడ్స్, హిమాయత్ నగర్, బషీర్ బాగ్, నాంపల్లి, అంబరపేట, కాచీగూడ,నల్లకుంట, మెహదీపట్నం సహా పలు ఏరియాల్లో వర్షం పడింది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
దీంతో నగర వాసులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. రోడ్లన్నీ నీట మునగడంతో వాహనాలు వెళ్లడం ఇబ్బంది గా మారింది. అయితే ఇలా అక్కడక్కడా వర్షం ఎలా సంభవిస్తుంది అన్న దానిపై హైదారాబాద్ వాతావరణ కేంద్రం స్పందించింది. క్యుములోనింబస్ మేఘాల వల్ల రాష్ర్టంలో అప్పుడప్పుడు ఇలాంటి వర్షాలు కురుస్తుంటాయని తెలిపారు. ఎక్కడైతే మబ్బులుంటాయో అక్కడే వర్షం పడుతుందన్నారు. అలాగే ఈ తరహా మేఘాలు ఎక్కడైతే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయో అక్కడ ఏర్పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.