వైఎస్ జగన్ సర్కారుకి షాక్: హౌసింగ్ స్కీమ్‌పై హైకోర్టు ఝలక్.!

ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు న్యాయ సమీక్ష జరిగితే నిలబడతాయా.? ఆక్షేపణకు గురవుతాయా.? అన్నదానిపై న్యాయ నిపుణుల నుంచి స్పష్టమైన నివేదిక తెప్పించుకోవాలి ప్రభుత్వంలో వున్నవారెవరైనా. పెద్ద సంఖ్యలో వుండే సలహాదారులు, ప్రభుత్వానికి ఇలాంటి విషయాల్లో కీలక సలహాలూ ఇవ్వాల్సి వుంటుంది.

మరి, వైఎస్ జగన్ సర్కార్ తీసుకుంటున్న చాలా నిర్ణయాలకు న్యాయస్థానాల్లో ఎందుకు చుక్కెదురవుతోంది.? ఎందుకంటే, ప్రభుత్వం ‘సలహా’ తీసుకోవడంలో విఫలమవుతోంది గనుక. సలహాదారులు సరైన సలహాలు ఇవ్వకపోవడంతోనే ఈ దుస్థితి అనుకోవాలా.?న్యాయస్థానాలు తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ప్రభుత్వంలో వున్నవారు గుస్సా అవ్వొచ్చుగాక. కానీ, స్వీయ తప్పిదాలకి మసిపూసి మారేడుకాయని చేసేస్తామంటే ఎలా.? పేదలకు ఇళ్ళ స్థలాలు, సొంతిళ్ళ విషయమై న్యాయస్థానం సంధించిన ప్రశ్నల్లో దేన్నీ తప్పు పట్టలేని పరిస్థితి.

జగనన్న ఇళ్ళు కాలనీలు కాదు, అవి ఊళ్ళు.. అంటూ పేదలకు ఇళ్ళ స్థలాలు, ఇళ్ళు వ్యవహారంపై వైసీపీ ప్రచారం చేసుకుంది. ఆ స్థాయిలోనే పెద్దయెత్తున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ జగన్ సర్కార్. కానీ, ప్రచారానికీ.. వాస్తవానికీ పొంతన లేకుండా పోయింది.

చిన్న చిన్న స్థలాల్లో ఇళ్ళు కట్టి ఏం ప్రయోజనం.? అన్న ప్రశ్న మొదట్లోనే ఉత్పన్నమైంది. అదీగాక, దాన్నొక ఆస్తిగా ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నించడం ఇంకో తప్పిదం. అమ్ముకునే అవకాశం కల్పిస్తే, వాళ్ళే తిరిగి పేదలుగా మారిపోతారన్న ప్రశ్నకు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడేం సమాధానం చెప్పగలుగుతుందో ఏమో. ఇప్పటికే పట్టాలు అందుకున్న లబ్దిదారులు అయోమయలో పడిపోతే, ప్రభుత్వం పెట్టిన కొన్ని షరతుల కారణంగా పట్టాలు అందనివారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయ్.

ఏదిఏమైనా ప్రభుత్వం, ఇలాంటి విషయాల్లో ఒకటికి పదిసార్లు ఆలోచించి, పబ్లిసిటీ కోసం.. అన్నట్టుగా కాకుండా బాధ్యతతో వ్యవహరిస్తే మంచిదేమో.