రాజకీయ నాయకులు ఎందుకు గెలవడం కోసం కష్టపడతారు.? జనాన్ని ఉద్ధరించేయడానికి.! సరే, గెలిచాక నిజంగానే ఉద్ధరించేస్తారా.? ఉద్ధరిస్తే, ఇంకా ఎందుకు పేదరికం ఇలాగే వుండిపోయింది.? అన్నది వేరే చర్చ. తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మంత్రి పదవి పోగొట్టుకుని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది. అప్పటిదాకా ఈటెల రాజేందర్ తెలంగాణ రాష్ట్ర సమితి దృష్టిలో గొప్పోడు.. అప్పటికప్పుడు చెడ్డోడైపోయాడు. ఏడేళ్ళుగా హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటెల రాజేందర్ ఏమీ చేయలేదంటూ హరీష్ రావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేనా, ఈటెల రాజేందర్ గెలిచినా.. ప్రతిపక్షంలో వుండి ఏం అభివృద్ధి చేయగలరు.? అని సిల్లీగా ప్రశ్నించేశారు హరీష్ రావు.
ఇంకెవరన్నా ఈ ప్రశ్న వేస్తే అది వేరే లెక్క. మంత్రి హరీష్ రావు నోట ఇలాంటి మాటలొస్తే, ఒకింత హాస్యాస్పదంగా వుంటాయి. తెలంగాణ ఉద్యమంలో హరీష్, ఈటెల కలిసి పని చేశారు. అలా ఇద్దరికీ తెలంగాణ రాష్ట్రంలో మంచి గుర్తింపు వుంది. ఏడేళ్ళుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఈటెల రాజేందర్ అభివృద్ధి చేయకపోతే, ఆ తప్పు తెలంగాణ రాష్ట్ర సమితిది. ఎందుకంటే, అభివృద్ధి చేయని ఈటెల రాజేందర్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీయార్, ఎందుకు మంత్రి పదవి కట్టబెట్టారట.? హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు.? అన్నది వేరే చర్చ. కానీ, ఇక్కడ గులాబీ పార్టీ గెలుపుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి హరీష్ రావు మాత్రం తన ఇమేజ్‌ని తానే ఇదిగో ఇలా డ్యామేజ్ చేసుకోవడమే చాలామందికి నచ్చట్లేదు.