హరీష్ రావుపై ఈటెల రాజేందర్ ‘బాంబు’ గట్టిగానే పేలింది

Harish Rao Slams Etela Rajender.

Harish Rao Slams Etela Rajender.

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, మంత్రి హరీష్ రావుకి పార్టీలో తగిన గౌరవం దక్కడం లేదంటూ పలు సందర్భాల్లో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. పార్టీలో కుటుంబ తగాదాలు పెరిగిపోయాయనీ, కేటీఆర్ సహా కవిత అత్యంత వ్యూహాత్మకంగా హరీష్ రావుని పక్కన పెట్టారన్న ప్రచారం జరిగింది, జరుగుతూనే వుంది. హరీష్ రావు మాత్రం, ఈ తరహా ప్రచారాల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఈటెల రాజేందర్ కూడా హరీష్ రావు విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు.

తనలానే హరీష్ రావు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో అవమానాల్ని ఎదుర్కొన్నారని ఈటెల తాజాగా వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఈటెల బాంబు బాగానే పేలింది.. హరీష్ రావు స్పందించాల్సి వచ్చింది. తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచింది.. అన్నట్టుగా ఈటెల వైఖరి వుందనీ, తనకు పార్టీలో ఎలాంటి అవమానాలూ జరగలేదనీ, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత మాత్రమే కాదు.. తనకు రాజకీయంగా గురువు కూడానని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

‘పార్టీ నాకు అప్పగించిన బాధ్యతల్ని నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా నిబద్ధతతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రభుత్వంలో అయినా అంతే.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదు. పదవుల మీద నాకు వ్యామోహం లేదు.. పార్టీ కోసం పనిచేస్తాను.. అది నా బాధ్యత..’ అని హరీష్ రావు స్పష్టం చేశారు. నిజానికి, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తర్వాత హరీష్ రావులో చాలా మార్పు వచ్చిందనే చర్చ గులాబీ పార్టీలోనే జరుగుతోందట. దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ కోసం అన్నీ తానే అయి వ్యవహరించారు.

పార్టీని గెలిపించేందుకు ప్రయత్నించారు. కానీ, దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాష్ట్ర సమితికీ, హరీష్ రావుకీ పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత హరీష్ రావుకి పార్టీలో ప్రాధాన్యత మరింత తగ్గిందనే అంటారు. కానీ, హరీష్ ధైర్యం చేసి.. తన ఆవేదనను బయటపెట్టుకునే పరిస్థితి లేదు. నిజానికి, కేటీఆర్ కంటే హరీష్ రావు సమర్థుడు. కానీ, కేటీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అదీ కేసీఆర్, హరీష్ రావుకి ఇచ్చే ప్రత్యేకమైన గౌరవం.