తెలుగు రాష్ర్టాల మధ్య మళ్లీ నీళ్ల యుద్ధం మొదలైంది. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నీటి తరలింపు కోసం కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం ఇప్పుడు వివాదానికి తెర లేపిన సంగతి తెలిసిందే. పోతిరెడ్డి పాడు నుంచి రాయలసీమకు రోజుకు 3 టీఎంసీల నీటి ఎత్తిపోతలకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 6829 కోట్ల పరిపాలన అనుమతులిచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవోను జారీ చేయడం…అటుపై తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యంతరం చెప్పడం జరిగింది.
అవసరమైతే సుప్రీంకోర్టు వరకూ వెళ్తామని ఏపీ సర్కార్ ని హెచ్చరించారు. దీనికి బధులుగా ఏపీ ఇరిగేషన్ శాఖా పంపకాల ప్రకారమే నీటిని తరలిస్తున్నామని..విభజన చట్టంలో ఉన్న అంశాల ఆధారంగానే ముందుకెళ్తున్నామని కౌంటర్ వేసారు. తాజాగా తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు కూడా ఏపీ తీరుపై మండిపడ్డారు. 805 లెవల్ లో లిప్ట్ పెట్టారంటేనే తెలంగాణపై కుట్ర చేస్తున్నట్లేనని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ర్టంలో పాలమూరు ప్రాజెక్ట్ కు అనుమతులు వచ్చాయని, కానీ జనవరిలోనే తాము ఫిర్యాదు చేసామని మంత్రి ఆరోపించారు.
కేంద్రం ఏపీలో ఒక మాట తెలంగాణలో మరో మాట చెప్పి దోబూచులాడుతోంది అన్నారు. అపెక్స్ కమిటీ నిర్ణయం తీసుకోకుండా ఏపీ ముందుకెళ్తుందని ఆరోపించారు. ఏపీ సర్కార్ చెబుతున్న మాటలకి..చేతలకి సంబంధం లేదన్నారు. నిన్న కేసీఆర్ ..నేడు హరీష్ రావు నీటి తరలింపు విషయంలో ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడంతో! ఇదే కొనసాగితే రెండు రాష్ర్టాల మధ్య మైత్రి దెబ్బతింటుందని..మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాడు చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాల్సి వస్తుందని పలువురు రాజకీయ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటివరకూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ వివాదం పై స్పందించలేదు.