వరప్రసాద్ ఈయనో బ్యూరోక్రాట్. రాజకీయాల్లోకి రావాలని తెగ ఆరాటపడ్డారు. ఈ ఆరాటం కాస్త ఎక్కువై 15 ఏళ్ల కిందట ఐఏఎస్ ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయ ఆరంగేట్రం చేశారు. తిరుపతి నుంచి ఎంపీ కూడా అయ్యారు. ఇక ఇప్పుడు గూడురు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఈమాజీ ఐఏఎస్ అధికారికి కార్యకర్తలకు అస్సలు పొసగడం లేదు. ఈయన ఎడ్డెం అంటే కార్యకర్తలు తెడ్డెం అంటున్నారు. ఈయనో రకం ఈయన క్యాడర్ ఇంకో రకం.
తిరుపతి వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు ఎవరికి అర్థం కాని అంశాల్లో ఏదో ఏదో మాట్లాడి అందర్ని గందరగోళం చేసినట్లే… ఇప్పుడు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యేగా ఉంటూ అదే విధంగా స్థానికులను ఇబ్బంది పెడుతున్నారట. లెదర్ ప్రాసెసింగ్ యునిట్ వద్దని ప్రజలు, కార్యకర్తలు బలంగా వాదిస్తున్నా ఈయన లెక్కచేయడం లేదంట. వస్తే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్నారట. ఎంతకీ ఎమ్మెల్యే వరప్రసాద్ వెనక్కి తగ్గకపోవడంతో చివరికి కార్యకర్తలు ఆయన ఇంటి ముందే ఆందోళనకు దిగాల్సి వచ్చింది.
గూడురులోని బలమైన సామాజిక వర్గాన్ని కూడా ఆయన పట్టించుకోవడం లేదట. ఎమ్మెల్యేగా గెల్చినప్పటికీ ఇంకా బ్యూరోక్రాట్ తరహాలోనే వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు తెగ బాధపడిపోతున్నారు. కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తూ ప్రజలు నేరుగా వచ్చి తననే కలవమని చెబుతున్నారట. ఈ కారణాల వల్ల కార్యకర్తలు ఆయనకు దూరమైపోతున్నారట. ఇలా పోగైన అసమ్మతి నాయకులు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారట.
దీంతో ఈ వ్యవహారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి కూడా వెళ్లిందట. అక్కడ ఏమీ తేలక పోవడంతో ఈ విషయాన్ని అమరావతిలోని పార్టీ పెద్దలకు సిఫారసు చేశారంటా సదరు మంత్రి. తమని పట్టించుకోవాలని స్థానిక నేతలు… నేరుగా ప్రజలతోనే ఉంటానని ఎమ్మెల్యే వరప్రసాద్ వాదిస్తున్నారట. దీంతో ఈ పంచాయతీ ఎంతకీ పరిష్కారం కావడం లేదట.