టీడీపీ… తెలంగాణ గురించి పక్కన పెట్టినా.. ఆ పార్టీ పుట్టిన ఏపీలో కూడా దానికి ఇప్పుడు ఆదరణ లేదు. ప్రస్తుతం టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. 2019 ఎన్నికల వరకు ఓ వెలుగు వెలిగిన పార్టీని ఇప్పుడు పట్టించుకునేవారే కరువయ్యారు. చంద్రబాబు కూడా అప్పుడున్నంత ఎనర్జీతో లేరు. పార్టీకి ముఖ్యంగా కావాల్సింది యువనాయకత్వం. ఆ విషయం లేటుగా తెలుసుకున్న చంద్రబాబు.. ఇప్పుడిప్పుడే యువనాయకత్వంపై దృష్టి పెట్టారు.
ఏదిఏమైనా.. చంద్రబాబు తర్వాత టీడీపీని ఆదుకోవాల్సింది లోకేశ్ బాబే. ఆయనే ఆ పార్టీకి దిక్కు. చంద్రబాబుతో పాటు టీడీపీ శ్రేణులంతా లోకేశ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. కానీ.. లోకేశ్ మొన్నటి ఎన్నికల్లోనూ ఓడిపోవడంతో.. అంతా డీలా పడిపోయారు. లోకేశ్ బాబు.. ఒక్కసారైనా ఎన్నికల్లో గెలిచి ఉంటే కథ వేరేలా ఉండేది.
ఏం జరిగినా కూడా నారా లోకేశ్ ను పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడం కోసం చంద్రబాబు చాలా కష్టపడుతున్నారు. అందుకే గ్రేటర్ ఎన్నికల బాధ్యతను లోకేశ్ కే అప్పజెప్పారట చంద్రబాబు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీడీపీ 90 డివిజన్లలో పోటీ చేస్తోంది. దీంతో అక్కడ ఎన్నికల ప్రచారం కోసం ఏకంగా లోకేశ్ నే చంద్రబాబు బరిలోకి దింపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం అన్ని ప్రాంతాల్లో తిరిగి టీడీపీ తరుపున లోకేశ్ ప్రచారం చేయనున్నారట. లోకేశ్ ప్రచారం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారట. చంద్రబాబు నెమ్మదిగా లోకేశ్ కు బాధ్యతలు అప్పజెప్పాలని చూస్తున్నారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు రావడంతో లోకేశ్ కు ఈ బాధ్యతలు అప్పజెప్పి తాను ఏపీ రాజకీయాల వైపే దృష్టి పెట్టారు చంద్రబాబు.