ఒకరేమో గ్రామ సింహమనే విమర్శలు చేస్తారు. ఇంకొకరేమో, వరాహమంటూ కౌంటర్ ఎటాక్ మొదలెడతారు. సోషల్ మీడియా వేదికగా నడిచే ఈ ‘యుద్ధం’ వల్ల ఉపయోగమెవరికి.? నాయకులుగా, ప్రజా సమస్యలపై స్పందించాల్సినోళ్ళు, ప్రజలకు మేలు చేయాల్సినోళ్ళు సోషల్ మీడియా వేదికగా తమ స్థాయిని దిగజార్చేసుకునేలా వ్యాఖ్యలు చేస్తోంటే, జనం నవ్విపోతున్నారు. ‘మా నాయకుడు అదిరిపోయే ట్వీటేశాడు.. ట్రోలింగ్‌లో ఇది అరాచకం..’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్లపై అభిమానులు మురిసిపోవచ్చుగాక. ‘మా మంత్రిగారు భలే కౌంటర్ ఎటాక్ చేశారు..’ అని వైసీపీ మద్దతుదారులు పండగ చేసుకోవచ్చుగాక. అంతిమంగా, ఇద్దరూ ప్రజల్లో పలచనైపోతున్నారు. ‘ఇదా రాజకీయం.?’ అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ తిట్ల ప్రవాహంతో ప్రజలెదుర్కొంటున్న ఏ సమస్యకి అయినా పరిష్కారం దొరుకుతుందా.? దొరకదుగాక దొరకదు.
అయినా, పవన్ కళ్యాణ్ ఇంత ఆవేశానికి ఎందుకు గురవుతున్నారు.. పవన్ సామాజిక వర్గానికే చెందిన పేర్ని నాని ఎందుకు తన స్థాయిని తగ్గించేసుకుంటున్నారు.? పవన్ ఏం చేసినా, అది తమ యజమాని చంద్రబాబు మేలు కోసమేనన్న అభిప్రాయం బలపడిపోయిందాయె. పేర్ని నాని విషయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే లాభం కలుగుతుందన్నది ఓపెన్ సీక్రెట్. సరే, రాజకీయాలంటే ఇలాగే వుంటాయని ఎవరైనా సరిపెట్టుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. జనసేన తరఫున కింది స్థాయి నేతలు ఇంతలా దిగజారిన వ్యాఖ్యలు (సన్నాసి, గ్రామ సింహాలు లాంటి వ్యాఖ్యలు) చేస్తే అది వేరే లెక్క. స్వయానా పవన్ కళ్యాణ్ అలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎలా.? మంత్రి పేర్ని నాని కూడా, తన పదవికి అన్యాయం చేస్తున్నారు. ఈ విమర్శల ప్రవాహం ఇంకే స్థాయికి దిగజారిపోతుందోగానీ, రాజకీయాలు ఎలా వుండకూడదో వీళ్ళని చూసి నేర్చుకోవాలన్న అభిప్రాయమైతే జన బాహుళ్యంలో వినిపిస్తోంది.