మంచి ‘మా’ట చెప్పిన మంచు విష్ణు.!

సినీ పరిశ్రమలో.. అందునా, నటీనటుల సంఘం ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) వ్యవహారాలకు సంబంధించి సభ్యులు మీడియాకి ఎక్కడమేంటి.? సినీ జనాలు గనుక, మీడియాకి సినీ పరిశ్రమలోని వ్యవహారాలపై ఒకింత ఆసక్తి ఎక్కువే వుండొచ్చు. కానీ, మీడియాతో మాట్లాడటం వల్ల తమకు అదనంగా ఒరిగే లాభమేంటో సభ్యులు తెలుసుకోవాలి.

‘మా’ ఎన్నికల కోసం మీడియాకెక్కి ప్రచారం చేసుకున్నారు ఇరు ప్యానళ్ళ (ప్రకాష్ రాజ్, మంచు విష్ణు) సభ్యులు. నిజానికి, మంచు విష్ణు ప్యానెల్‌తో పోల్చితే, ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు మీడియాకి ఎక్కింది తక్కువే. ‘అసలు మీడియాని ఆశ్రయించాల్సిన పనేంటి.?’ అన్న ప్రశ్న ప్రకాష్ రాజ్ నుంచే తొలుత వినిపించింది కూడా.

రచ్చ రచ్చ చేసుకున్నారు.. మీడియాకెక్కి నానా రబసా చేశారు. ఇప్పుడేమో, ఇకపై మీడియా దగ్గరకి ‘మా’ ప్యానెల్ సభ్యులెవరూ వెళ్ళరని ‘మా’ కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. నిజంగానే ఎవరూ మీడియా ముందుకు రాకపోతే అదో గొప్ప విషయమే.

కానీ, మంచు విష్ణుని గౌరవించి, ఆయన ప్యానెల్‌కి చెందిన సినీ జనాలు మీడియా ముందుకు రాకుండా వుంటారా.? వుంటే మాత్రం ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు సూపర్ సక్సెస్ అయినట్లే భావించాల్సి వస్తుంది.