కేసీఆర్‌ వర్సెస్‌ మోడీ: ఎవరి దమ్మెంతో తేలిపోతుందంతే.!

BJP has rocked the ruling party this time

గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. డిసెంబర్‌ 3న ఒకే ఒక్క డివిజన్‌లో రీ-పోలింగ్‌ జరగడంతో, పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిపోయింది. ఎన్నికల ఫలితాల వెల్లడికి రంగం సిద్ధమవుతోంది.

TRS Vs BJP
TRS Vs BJP

ఈలోగా ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలొచ్చేశాయి. ఒకే ఒక్క సర్వే తప్ప, మిగతా సర్వేలన్నీ తెలంగాణ రాష్ట్ర సమితి గెలుస్తుందని తేల్చేశాయి. టీఆర్‌ఎస్‌ తర్వాతి స్థానం మజ్లిస్‌ పార్టీదేననీ కుండబద్దలుగొట్టేశాయి. మరి, భారతీయ జనతా పార్టీ పరిస్థితేంటి.? కాంగ్రెస్‌ పార్టీ సంగతేంటి.? టీడీపీ ఎక్కడుంది.? ఈ ప్రశ్నలకు సమాధానాలు కొద్ది గంటల్లో తెలుస్తాయి. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల్ని బట్టి చూస్తే, తెలంగాణ రాష్ట్ర సమితి సగర్వంగా గ్రేటర్‌ మేయర్‌గిరీని ఇంకోసారి దక్కించుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

గులాబీ గెలుపు.. కేటీఆర్‌ సాధించినట్లే.!

కాళ్ళకు చక్రాలు కట్టుకుని తిరిగారా.? అన్నట్టు గ్రేటర్‌ ఎన్నికల వేళ కేటీఆర్‌ ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయనే స్టార్‌ క్యాంపెయినర్‌ టీఆర్‌ఎస్‌ నుంచి. ఒకే ఒక్కడు.. అనడం అతిశయోక్తి కాదేమో. హైద్రాబాద్‌లో వరదలు సహా అనేక సమస్యల నడుమ, టీఆర్‌ఎస్‌ని ఇంకోసారి అధికారంలోకి తీసుకురావడమంటే ఆషామాషీ కాదు గ్రేటర్‌ పరిధిలో. అయినాగానీ, కేటీఆర్‌.. మాటల మాంత్రికుడిలా తన పని తాను చేసుకుపోయారు. ప్రత్యర్థుల విమర్శలకు తనదైన స్టయిల్లో కౌంటర్‌ ఇచ్చారు. ఓవరాల్‌గా కేటీఆర్‌, దుమ్ము రేపేశారు ఎన్నికల ప్రచారంలో.

మోడీ మార్క్‌ ఎక్కడ.?

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పాతబస్తీలోని భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా గ్రేటర్‌ ఎన్నికల్లో హీట్‌ విపరీతంగా పెంచేశారు. అంతకు ముందు, అదే భాగ్యలక్ష్మి దేవాలయం సాక్షిగా కేసీఆర్‌కి సవాల్‌ విసిరారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌. పలువురు కేంద్ర మంత్రులు గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో హల్‌చల్‌ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కరోనా వ్యాక్సిన్‌పై సమీక్ష.. అంటూ గ్రేటర్‌ ఎన్నికల సమయంలోనే హైద్రాబాద్‌కి వచ్చి వెళ్ళారు. ఈ క్రమంలో ప్రోటోకాల్‌ ప్రకారం ముఖ్యమంత్రికి అవకాశం కల్పించాల్సి వున్నా.. స్వాగతం పలికే లిస్ట్‌లో ముఖ్యమంత్రి పేరుని చేర్చలేదు ప్రధాని కార్యాలయం. అదొక రాజకీయ రచ్చకు కారణమైంది. ఇంతా చేసి, గ్రేటర్‌ పరిధిలో బీజేపీ చతికిలపడటమంటే.. అది ఆ పార్టీకి పెద్ద దెబ్బే. అయితే, ఓట్‌ షేర్‌ పరంగా బీజేపీ చెప్పుకోదగ్గ స్థాయిలోనే సత్తా చాటవచ్చునని ఎగ్జిట్‌ పోల్‌ అంచనాలు చెబుతుండడం కాస్త ఊరట ఆ పార్టీ నేతలకి.

కాంగ్రెస్‌, టీడీపీ సోదిలో కూడా లేవా.?

కాంగ్రెస్‌ పార్టీతోపాటు, టీడీపీ.. గ్రేటర్‌ ఎన్నికల్లో సోదిలోకి కూడా లేకుండా పోయాయి. కాస్తో కూస్తో కాంగ్రెస్‌ బెటర్‌.. అని ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలు చెబుతున్నాయి. ఓ ఐదు డివిజన్ల వరకు కాంగ్రెస్‌ గెలుచుకునే అవకాశం వుందట. ఏమో, అదృష్టం కలిసొస్తే.. పది వరకూ వెళ్ళొచ్చని అంటున్నారు. కొద్ది గంటల్లోనే గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న దరిమిలా, అభ్యర్థుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల తరహాలో అభ్యర్థులు ఖర్చు చేయడమే ఇందుకు కారణం.