పది రోజుల క్రితం కిడ్నాప్ డ్రామా ఆడి హైదరాబాద్ లో కలకలం రేపిన బీఫార్మసీ కథ విషాదాంతంగా మారింది. కాలేజీకి వెళ్లి తిరిగొస్తుండగా కిడ్నాప్ అయ్యానంటూ తల్లికి ఫోన్ చేసి పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన యువతి చివరకు దారుణ నిర్ణయం తీసుకుంది. కిడ్నాప్ డ్రామా అంతా ఫేక్ అని పోలీసులు తేల్చడంతో ఇంటా బయటా తీవ్ర విమర్శలువచ్చాయి. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురయినట్టు సమాచారం.
ఈ ఘటన జరిగిన తర్వాత ఆ యువతి తన అమ్మమ్మ వాళ్లింట్లో ఉంటోంది. ఈ పది రోజులుగా కూడా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా ఇంట్లోనే ఉండిపోయింది. తీవ్ర మనస్తాపంతో మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గుర్తించి ఆమెను కుటుంబ సభ్యులు ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
ఫిబ్రవరి 10వ తేదీన కాలేజీకి వెళ్లిన తమ కూతురు ఇంటికి రావడం ఆలస్యం కావడంతో ఘట్‌కేసర్‌కు చెందని మహిళ పదే పదే ఫోన్ చేసింది. దాంతో తల్లిని నమ్మించేందుకు తనను కొందరు కిడ్నాప్ చేశారని, రక్షించాలని కోరుతూ తల్లికి ఫోన్ చేసింది. ఆ వెంటనే విద్యార్థిని తల్లి డయల్ 100 కు కాల్ చేసి ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.రాత్రి దాదాపు 7.45 గంటల ప్రాంతంలో అన్నోజిగూడ రైల్వేగేట్ సమీపంలో ఫార్మసీ విద్యార్థినిని అపస్మారక స్థితిలో పోలీసులు గుర్తించారు. యువతి కాలికి గాయాలైనట్లు గుర్తించిన పోలీసులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తాను ప్రతిఘటించడం, సమయానికి పోలీసుల సైరన్ రావడంతో నిందితులు పరారయ్యారని ఫార్మసీ విద్యార్థులు వారిని తప్పుదోవ పట్టించిందని మూడో రోజులకు తేలడం తెలిసిందే.