వైసీపీ గేట్లు తెరిస్తే ఎగిరిదూకేయాలని చూస్తున్న నేత గంటా శ్రీనివాసరావు. గత కొన్ని నెలలుగా వైసీపీలోకి వెళ్లాలని గంటా గట్టిగా ట్రై చేస్తున్నారు. అంతా సెట్టైపోయింది..ఇదిగో వెళ్లడమే తరువాయి అనుకున్న ప్రతిసారీ ఏదో ఇక అడ్డంకి. అది కూడ వైసీపీ నుండే కావడం విశేషం. తెలుగుదేశంలో కీలకంగా ఉన్న గంటా వైసీపీలోకి వెళ్లాలని ఎన్నికల ముందే అనుకున్నారు. కానీ ఎందుకో ఆగారు. ఈలోపు అవంతి శ్రీనివాస్ ఫ్యాన్ కిందికి చేరిపోయి పొందాల్సిన ప్రయోజనం పొందేశారు. గంటా కూడ ఎన్నికల ముందే వైసీపీలో చేరి ఉంటే ఈపాటికి మంత్రి వర్గంలో ఉండేవారనడంలో సందేహం లేదు. గంటాకు విశాఖలో మంచి పట్టుంది. పరిచయాలు ఎక్కువే. ఎలాంటి టిపికల్ సిట్యుయేషన్ అయినా హ్యాండిల్ చేయగల కేపబిలిటీ ఉన్న వ్యక్తి.
అందుకే ఇప్పుడైనా ఆయన్ను పార్టీలోకి తీసుకోవడానికి జగన్ రెడీ. కానీ పార్టీలో నెంబర్ 2 నేత విజయసాయిరెడ్డి మొకాలడ్డుతున్నారు. గంటా సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ లాంటి వారి ద్వారా మంతనాలు జరిపినా విజయసాయి అడ్డుపడుతున్నారట. విశాఖ రాజకీయాలను ప్రజెంట్ విజయసాయిరెడ్డే చూసుకుంటున్నారు. ఇప్పుడు గంటాను పార్టీలోకి తీసుకొస్తే తనకే ఎసరు పెడతారనేది విజయసాయి భయం. అందుకే అడ్డం తగులుతున్నారు. జగన్ ఏమో విజయసాయి మాటను కాదనరు. ఇలా గంటా రాజకీయ ప్రయాణం రెండు కూడళ్ల మధ్యన నిలిచిపోయింది.
అందుకే ఇంకా ఎదురుచూస్తే మరీ చులకనైపోతామని అనుకున్నారో ఏమో కానీ వైసీపీ ఆహ్వానానికి ఈ ఏడాది ఆఖరు వరకు డెడ్ లైన్ పెట్టుకున్నారట ఆయన. ఈలోపు పార్టీ పిలిస్తే సరేసరి లేకుంటే ఆ తర్వాత పిలిచినా వెళ్ళేది లేదని నిర్ణయించుకున్నారట. ఒకవేళ యేడాదిలోపు వైసీపీ నుండి ఆహ్వానం రాకపోతే ఏం చేస్తారు అంటే దానికి కూడ ఒక ఆల్టర్నేట్ చూసుకున్నారట. అదే భారతీయ జనతా పార్టీ. వైసీపీలోకి వెళ్లలేని పక్షంలో నేరుగా బీజేపీ గూటికే చేరతారని టాక్. అసలే నాయకుల కొరతతో అల్లాడుతున్న బీజేపీ గంటా లాంటి నాయకులు వస్తామంటే ఎర్ర తివాచీ పరచి మరీ ఆహ్వానిస్తుంది.