వైసీపీ గూటికి టీడీపీ కీలక నేత ?

Ganta Srinivas Rao ready to leave TDP
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారనున్నారనే సమాచారం ఊపందుకుంది.  ఇప్పటికే పలుమార్లు ఆయన వైసీపీలో చేరతారని ఊహాగానాలు వినబడగా ఇంతవరకు అది జరగలేదు.  గంటా సైతం గతంలో ఆ వార్తలను ఖండిస్తూ వచ్చారు.  ఇక తాజాగా మరోసారి ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం మొదలైంది.  ఎప్పుడు గంటా పార్టీ మారనున్నారనే వార్తలు వచ్చినా ఖండిస్తూ వచ్చిన టీడీపీ అనుకూల మీడియాలోనే ఈసారి గంటా పార్టీ మారనున్నారనే వార్తలు రావడంతో ఈసారి గంటా పార్టీ మార్పు ఖాయమని చాలామంది అనుకుంటున్నారు.  
 
వైసీపీ అధిష్టానం నుండి కూడా గంటాకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు చెప్పుకుంటున్నారు.  టీడీపీ సీనియర్ నేతల్లో గంటా కూడా ఒకరు.  విశాఖ జిల్లాలో టీడీపీని గట్టిగా నిలబెట్టిన నాయకుడు.  మంత్రిగా పనిచేసిన అనుభవం, పలు ప్రధాన రాజకీయ పార్టీలతో పనిచేసి ఉండటంతో టీడీపీలో రాష్ట్ర రాజకీయాల్లో గంటాకు మంచి పేరుంది.  ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అయినా నిలబడిన చోట నెగ్గగల సత్తా ఉన్న నేత.  అందుకే టీడీపీలో ఆయనకు ప్రాధాన్యం ఎక్కువ.  కానీ గత కొన్నిరోజులుగా గంటా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా ఉండటం లేదు.  
 
పార్టీ కీలక నేతలు అరెస్టవుతున్నా కూడా ఆయన పెద్దగా ప్రతిస్పందించలేదు.  వైసీపీ నేతలు పలుసార్లు నెక్స్ట్ అరెస్టవబోయేది గంటానే అంటూ సంకేతాలిచ్చారు.  దీన్నిబట్టి ఈసారి గంటా వైసీపీలోకి వెళ్లడం ఖాయమని అంటున్నారు.  సీఎం ఇళ్ల పట్టాల పంపిణీకి పెట్టుకున్న ముహూర్తం ఆగష్టు 15 నాడే గంటా కూడా పార్టీ మారతారని తెలుస్తోంది.  మరోవైపు వైసీపీలో అవంతి శ్రీనివాస్, విజయసాయి రెడ్డిలకు గంటా చేరిక ఇష్టం లేదని, అందుకే గంటా వేరొక వర్గం ద్వారా ముఖ్యమంత్రిని అప్రోచ్ అయ్యారని తెలుస్తోంది.  మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది గంటా నేరుగా స్పందిస్తే తప్ప తెలియదు.