గంగుల వర్సెస్ ఈటెల: గులాబీ దోపిడీ బయటపడ్తోందిలా..

Gangula Vs Etela

Gangula Vs Etela

అధికారంలో వున్నన్నాళ్ళూ అడ్డంగా దోచుకున్నారంటూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈటెలపై గంగులను ఉసిగొల్పుతున్నది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. వాస్తవానికి ఈటెల రాజేందర్ అంటే మిస్టర్ క్లీన్.. అన్న భావన చాలామందిలో వుంది. విపక్షాల్లోనూ ఈ భావన గట్టిగానే వినిపిస్తుంటుంది. కానీ, ఈటెల రాజేందర్ అసలు వ్యవహారమేంటో, ఆయనకు చెందిన హేచరీస్ భూ కబ్జా ఆరోపణలతో తేటతెల్లమైపోయింది. అందులో అక్రమాలు జరిగాయా.? లేదా.? అన్నది నిర్ధారించాల్సింది న్యాయస్థానం అనుకోండి.. అది వేరే సంగతి. కానీ, ఈటెల కబ్జాల గురించీ, ఈటెల సాగించిన ఇతర దోపిడీ వ్యవహారాల గురించీ మంత్రి గంగుల కమలాకర్ పూసగుచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క ఈటెల రాజేందర్ కూడా ఏమాత్రం తగ్గడంలేదు.. అదికార పార్టీకి చెందిన కొందరు నేతల దోపిడీని చక్కగా వివరిస్తున్నారు.. మీడియా ముఖంగానే.

ఇరువురూ చెప్పింది నిజమే అనుకుంటే.. గడచిన ఏడేళ్ళలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణను నిలువునా దోచేసిందన్న అభిప్రాయం కలగకమానదు. వ్యక్తులు పార్టీలు మారే క్రమంలో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణమే అయిపోయాయి. దాంతో, దోపిడీ ఆరోపణలు.. రాజకీయ రచ్చకు కారణమవుతున్నాయి తప్ప.. ఆ దోపిడీల్లో నిజాలు మాత్రం నిగ్గు తేలడంలేదు. ఈటెల వివాదానికి సంబంధించి క్వారీ అక్రమాల సంగతి తెరపైకొచ్చింది. ఈటెల వర్సెస్ గంగుల.. ఈ క్వారీ ఆరోపణలు పరస్పరం చేసుకుంటున్న దరిమిలా, ఇది నిజంగానే కొత్త కోణం. తెలంగాణ ప్రభుత్వం, ఈటెల మీద వచ్చిన ఆరోపణల్లో ఎంత వేగంగా స్పందించిందో.. అంతే వేగంగా ఈటెల చేస్తున్న ఆరోపణలపైనా విచారణ చేపట్టి, రాత్రికి రాత్రి నిజాలు నిగ్గు తేల్చితే బావుంటుందేమో.