గణేశ్ చతుర్థి అంటేనే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేశ్. అవును.. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేశ్ ను దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. ఖైరతాబాద్ గణేశ్ కు ఉన్న ప్రఖ్యాతి అటువంటిది.
దశాబ్దాల నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ఖైరతాబాద్ గణేశ్ ను ప్రతిష్టించి కొలుస్తుంటారు. ఈసారి ధన్వంతరి రూపంలో ఖైరతాబాద్ గణేశ్ దర్శనమిస్తున్నాడు. అయితే.. సాధారంగా 50 నుంచి 60 అడుగుల వరకు ఖైరతాబాద్ గణేశ్ ను తయారు చేస్తారు.
కానీ.. ఈసారి మాత్రం 6 అడుగుల లోపే గణేశ్ విగ్రహాన్ని తయారు చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి అంత చిన్నగా వినాయకుడిని తయారు చేశారు.
ఇక.. చెడుపై విజయం కోసం ధన్వంతరి యాగం చేస్తారు. అందుకే.. ఈసారి వినాయకుడిని ధన్వంతరి రూపంలో ప్రతిష్టించారు.
కరోనా నేపథ్యంలో ఈ ధన్వంతరి వినాయకుడు త్వరగా అందరికీ విముక్తిని కలిగించాలని ధన్వంతరి రూపంలో వినాయకుడిని ప్రతిష్టించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ వినాయకుడి ఒక చేతిలో అమృతం ఉండగా.. మరో చేతిలో ఆయుర్వేదం ఉంది.
ఈ వినాయకుడి మరో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే.. ఈ విగ్రహం తయారీ కోసం మట్టిని గుజరాత్ నుంచి తెప్పించారు. ఈసారి ఎత్తు తక్కువగా ఉండటంతో ఈ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం లేదని… విగ్రహాన్ని నిలబెట్టిన చోటునే ద్రవాలతో అభిషేకం చేసి నిమజ్జనం చేయనున్నట్టు కమిటీ సభ్యులు వెల్లడించారు.
అయితే.. ఈసారి ఖైరతాబాద్ గణేశ్ ను చూడటానికి భక్తులకు అనుమతి లేదు. కరోనా దృష్ట్యా గణేశుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఇప్పటికే గణేశ్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులకు అనుమతి లేనప్పటికీ.. కొంతమంది భక్తులు మాత్రం ఖైరతాబాద్ గణేశ్ ను దర్శించుకోవడానికి క్యూ కడుతున్నారు.