అప్పులు.. ఉచిత పథకాల గురించి కేంద్రానికి ఫిర్యాదులా.?

Free Schemes and Silly Politics

Free Schemes and Silly Politics

నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాస్తూ, రాష్ట్రాల్లో ఉచిత పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా చట్టం తీసుకురావాలంటూ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో అది సాధ్యమయ్యే పనేనా.? పైగా, ఈ ఉచిత పథకాల ద్వారా రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడమేంటి.? అక్కడికి కేంద్రమేదో అప్పులు చేయకుండా ప్రజా రంజకమైన పాలన చేసేస్తున్నట్లు.? కేంద్రం ఇటీవలి కాలంలో చేసిన అప్పులు అన్నీ ఇన్నీ కావు. ఆ అప్పులు చాలక, జనాన్ని వివిద రకాల పన్నుల పేరుతో వీర బాదుడు బాదేస్తోంది.

కేంద్రం తాము చేస్తున్న అప్పుల్ని సమర్థించుకోవడానికి వీలుగా.. రాష్ట్రాలు అప్పులు చేసినా తప్పుపట్టడంలేదు.. పైగా రాష్ట్రాలు మరిన్ని అప్పులు చేయడానికి వీలుగా సహకరిస్తోంది కేంద్రం. నిజమే, సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రజల్ని నిర్వీర్యం చేస్తాయి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. కానీ, ప్రజలు చేస్తున్నదేంటి.? ఆ సంక్షేమ పథకాల కోసం ఎగబడుతూ, అభివృద్ధి గురించి ప్రభుత్వాల్ని ప్రశ్నించడమే మర్చిపోయారు. అలాంటప్పుడు అధికారంలో వున్నవారికి అభివృద్ధి గురించిన ఆలోచన ఎందుకొస్తుంది.? ఇక్కడ ఫలానా రాష్ట్రమే సంక్షేమ పథకాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని అనుకోవడానికి వీల్లేదు.

ఈ ఉచిత పథకాల వల్లనే కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. అది చూసి, అన్ని రాష్ట్రాల్లోనూ రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో ఉచిత పథకాల్ని ప్రకటిస్తున్నాయి. ఇప్పటికైతే ఇంటింటికీ రేషన్.. ముందు ముందు వంట చేసేసి, ఆ వండిన ఆహార పదార్థాల్ని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే పథకాల్ని కూడా ప్రకటిస్తారేమో. బహుశా కేంద్రం కూడా ఇలాంటి ఆలోచనల్ని భవిష్యత్తులో చెయ్యక తప్పదేమో.