ఆదివారం అయితే చాలు చాలా మంది ప్రజలకు ముక్క లేనిదే ముద్ద దిగదు. ఆదివారం రాగానే ఉదయం లేవగానే చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ ల ముందు బారులు తీరుతారు. ధర సంగతి పక్కన పెట్టి సెలవు రోజున కడుపు నిండా కమ్మటి రుచితో తినాలని చూస్తారు. మాంసం ఎక్కడి నుంచి వచ్చింది, కోసిన కోడి, మేక ఆరోగ్యకరమైనవేనా అనే విషయాలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కొన్ని ప్రాంతాల్లో ఫ్రిడ్జ్ లో పెట్టి మరుసటి రోజున చికెన్, మటన్ అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇది పక్కన పెడితే ఇపుడు బెజవాడలో వెలుగు చూసిన ఘటన నగర వాసుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తుంది. అక్కడి కొందరు ప్రజలు మటన్ జోలికి వెళ్ళకూడదు అనేలా చేసింది ఈ ఘటన. ఇంతకీ ఏం జరిగిందంటే, విజయవాడ లో అధికారులు మటన్ మాఫియా గుట్టు రట్టు చేసారు. విజయవాడ లోని రైల్వే పార్సిల్ ఆఫీసులో నిల్వ ఉంచిన మటన్ పట్టుకున్నారు. రైల్వే పార్సిల్ ఆఫీసుకు మటన్ పార్సిల్స్ వచ్చినట్లు సమాచారం రావడంతో రంగంలోకి దిగిన విజయవాడ మున్సిపల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 16 మటన్ పార్సిల్ బాక్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కావడంతో పార్సిల్స్ ద్వారా పోటెళ్ళ మాంసాన్ని తెప్పించి అమ్మడానికి సిద్ధం ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ నుండి విజయవాడకు ఈ పార్సిల్స్ వచ్చాయి.
డబ్బు సంపాదించడానికి కొందరు వ్యాపారులు ఇలా అడ్డదారులు తొక్కుతుండడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. ప్రజల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా డబ్బే లక్ష్యంగా వ్యాపారం సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిని ఎవరినీ వదిలేది లేదని అధికారులు హెచ్చరించారు. ఎక్కడైనా చెడిపోయిన, పాడైపోయిన, దుర్వాసన వస్తున్న మాంసం అమ్ముతున్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.