కొత్త ఏడాది ప్రారంభంలోనే తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు ఊహించని షాక్ ఇచ్చింది. 2026 మొదటి వారం నుంచే కోడి మాంసం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. గత కొద్ది రోజుల వరకు కేజీకి రూ.200 నుంచి రూ.250 మధ్య ఉన్న చికెన్ ధర, ఇప్పుడు ఏకంగా రూ.300కు చేరి వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతోంది. మార్కెట్‌కు వెళ్లిన ప్రతిసారీ ధరలు చూసి ఇంత పెరిగితే తినేదెలా.. అని వినియోగదారులు వాపోతున్నారు.
చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధర కూడా భారీగా పెరగడం పరిస్థితిని మరింత దారుణంగా మారింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఒక్క గుడ్డు ధర రూ.8గా పలుకుతుండటంతో మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. రోజువారీ ఆహారంలో భాగమైన కోడి మాంసం, గుడ్లు ఇలా ఒక్కసారిగా అందుబాటులో లేకుండా మారడంతో వినియోగదారుల అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మార్కెట్ వివరాలు చూస్తే ధరల వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బ్రాయిలర్ చికెన్ కేజీ ధర రూ.300గా ఉండగా, లైవ్ కోడి కేజీ ధర రూ.170 వరకు ఉంది. ఫారం కోడి మాంసం కేజీ రూ.180గా పలుకుతుండగా, బండ కోడి మాంసం ధర రూ.280 వరకు చేరింది. ఒకే చికెన్ అయినా రకం బట్టి ధరలు మారుతుండటం వినియోగదారులకు గందరగోళంగా మారింది. ఏపీ ఉత్తరాంధ్రలోని పాయకరావుపేట, నక్కపల్లి పరిసర ప్రాంతాల్లో వందల సంఖ్యలో పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. దాదాపు 450 వరకు కోళ్ల పారాల నుంచి రోజుకు లక్షల సంఖ్యలో కోళ్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. జిల్లా అవసరాలతో పాటు పక్క రాష్ట్రాలకు కూడా కోడి మాంసం ఎగుమతి జరుగుతోంది. అయినప్పటికీ ఇంత భారీ స్థాయిలో ధరలు పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాపారులు చెబుతున్నారు.
గతంలో బర్డ్ ఫ్లూ భయంతో కోడి మాంసం ధరలు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఆ తర్వాత ప్రభుత్వ సహకారంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో వినియోగం మళ్లీ పెరిగి ధరలు క్రమంగా స్థిరపడ్డాయి. డిసెంబర్ నెల వరకు కేజీ చికెన్ ధర రూ.240 నుంచి రూ.250 మధ్య కొనసాగింది. అయితే డిసెంబర్ చివరి వారం నుంచే డిమాండ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. వ్యాపారుల మాటల్లో చెప్పాలంటే, సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో పెరిగిన డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. పండుగ సీజన్ ముగిసిన తర్వాత ధరలు కొంత తగ్గే అవకాశం ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ అప్పటివరకు చికెన్ ప్రియులకు ఈ ధరల మంట తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
