మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి సమయంలో తీవ్రమైన గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే ఐసీయుకి తరలించి వైద్యం అందించినట్లు తెలుస్తోంది. అనంతరం కాసేపటికి రాయపాటి ఆరోగ్యం కుదిటపడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు కూడా వెల్లడించారు. ఈ విషయం తెలిసిన టీడీపీ ముఖ్య నేతలంతా కుటుంబ సభ్యుల్ని ఫోన్ లో పరామర్శించారు. రాయపాటి ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీసారు.
నేటి ఉదయం కొంత మంది నేతలు ఆయన్ని చూడటానికి ఆసుపత్రికి వెళ్లినట్లు సమాచారం. అలాగే నేడు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో టీడీపీ నేతలంతా ఆపనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలో ఓటింగ్ జరుగుతోంది. సాయంత్రం ఫలితాలు రానున్నాయి. అనంరతం ఏపీ టీడీపీ నేతలు కూడా రాయపాటిని పరామర్శించే అవకాశం కనిపిస్తోంది. కాగా బ్యాంకు రుణాల ఎగవేత కేసులో రాయపాటిని సీబీఐ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. రాయపాటికి చెందిన ట్రాయ్ సంస్థ పొలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ను దక్కించుకుని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలమవడంతో సీబీఐ విచారణ విచారణ చేపడుతోంది.
అలాగే రెండు రోజుల కిత్రమే ఈ కేసును ఆధారంగా చేసుకుని మలయాళి నటి మరియాపాల్ రాయపాటికి ఫోన్ చేసి తాను సీబీఐ అధికారినంటూ అడిగినంత డబ్బు ఇస్తే ఎలాంటి కేసులు లేకుండా వదిలేస్తానంటూ వల్లించింది. రాయపాటి విషయాన్ని పసిగట్టి అసలైన సీబీఐని రంగంలోకి దించి మరియాపాల్ ఆట కట్టించారు. మరియాపాల్ అంతకు ముందు చాలా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టింది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలా ఆమెకు ఓ చరిత్ర ఉంది. కొన్నాళ్లుగా ప్రభుత్వ అధికారులు, పోలీసుల కళ్లు కప్పి తిరుగుతోంది.