కేరళ అంటే చైతన్యానికి మారు పేరు. కానీ, ఆ కేరళ గత కొంతకాలంగా వరదలతో విలవిల్లాడుతోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు వరదలు ముంచెత్తేస్తున్నాయ్. పెద్దయెత్తున ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ఆస్తి నష్టం సంగతి సరే సరి. ప్రతి యేడాదీ కనీ వినీ ఎరుగని స్థాయిలో వరద నష్టం కనిపిస్తోంది. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది.
నిజానికి, కేరళ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో, అందునా ప్రధాన నగరాల్లో అనూహ్యమైన స్థాయిలో ఆకస్మిక వరదలు పోటెత్తేస్తున్నాయ్. తక్కువ సమయంలో రికార్డు స్థాయి వర్షపాతం కురవడం అనేది ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది.
ప్రముఖ నగరాలే కాదు, చిన్న చిన్నపట్టణాలు, ఓ మోస్తరు గ్రామాలు కూడా కాంక్రీట్ జంగిల్స్ అయిపోతున్న రోజులివి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, కేరళ చాలా ప్రత్యేకం. అక్కడ కాంక్రీట్ జంగిల్స్ వున్నాసరే.. పచ్చదనం ఎక్కువ. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో నీట వనరుల చుట్టూ అభివృద్ధి చెందిన గ్రామాలు, నగరాలు దర్శనమిస్తాయి.
కేరళకు ఇప్పుడు ఆ నీటి వనరులే శాపంగా మారుతున్నాయి. కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఓ చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళేందుకు బోట్లను ఎక్కువగా వినియోగిస్తారంటే, అక్కడి నీటి వనరులు ఏ స్థాయిలో వుంటాయో అర్థం చేసుకోవచ్చు. నీటి మీద ప్రయాణం.. కేరళ పర్యాటక రంగానికి కొత్త అందాన్నిస్తోంది చాలాకాలంగా.
మరి, ఎప్పటికప్పుడు పోటెత్తుతున్న వరదలు.. అనూహ్యంగా కురుస్తున్న వర్షాలతో కేరళ భవిష్యత్తు ఏమవబోతోంది.? ఏమోగానీ, ఇది ఒక్క కేరళ సమస్య మాత్రమే కాదు.. అన్ని రాష్ట్రాల సమస్య కూడా. హైద్రాబాద్ నగరాన్నే తీసుకుంటే, ఇంట్లోంచి వాహనంలో బయటకు వెళ్ళాలంటే భయం.. ఏ క్షణాన అకాల వర్షం కురిసేసి, రోడ్లు మునిగిపోయి.. అందులో ఇరుక్కుపోవాల్సి వస్తుందోనని.
జాతీయ స్థాయిలో ఈ పరిస్థితులపై చర్చ జరగాలి, సమస్యలకు పరిష్కారం వెతకాలి. లేదంటే, ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం మాత్రమే కాదు.. దేశం ఆర్థికంగా ఈ వరదల కారణంగా చితికిపోయే పరిస్థితి వచ్చింది మరి.