East Godavari: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని ఎంత చెప్పినా మందు బాబులు మాత్రం అన్నింటినీ పెడచెవిన పెట్టీ ప్రతిరోజు మందు తాగుతూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో లో చిన్న పిల్లలు, పెద్దవారు అని తేడా లేకుండా మద్యపానానికి అలవాటు పడుతున్నారు. మద్యపానం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తి ఎంతోమంది ప్రాణాలు విడిచే పరిస్థితి కూడా వస్తోంది. ప్రస్తుతం ఇలాంటి సంఘటన ఒకటి తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ఏజెన్సీ రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కల్తీ కల్లు తాగటం వల్ల ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు. గ్రామానికి చెందిన ఐదు మంది ఈరోజు ఉదయం జీలుగు కల్లు తాగారు. కల్లు తాగిన వెంటనే వారు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులు విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది వెంటనే వారిని గడ్డంగి ఆస్పత్రికి తరలించారు. గడ్డంగి ఆస్పత్రిలో ఇద్దరు ప్రాణాలు విడువగా,ముగ్గురుని కాకినాడ ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించారు.వైద్యం జరుగుతున్న సమయంలో ఆ ముగ్గురు కూడా మరణించారు.
ఈ సంఘటనపై జిల్లా యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు తాగిన కల్లు శాంపిల్ సేకరించి దానిని పరీక్షించడానికి ల్యాబ్ కి పంపించారు. ఈ సంఘటన జరగటానికి కల్తీ కల్లా,లేక ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా..అన్న విషయం గురించి దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఒకేసారి ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు మరణించటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కల్తీ కల్లు తాగటం వల్లే ఈ ఘటన జరిందని పోలీసులు ప్రాథమిక అంచనా.