దూరం దూరం… దిగిరాక తప్పదు పవన్!

ఈసారి ఎన్నికల్లో టీడీపీ – జనసేన పొత్తులో కలిసి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా అధికార వైసీపీని గద్దె దింపాలని.. అధికారం చేజెక్కించుకోవాలని బలంగా భావిస్తున్నాయి. ఈ సమయంలో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే కాపులకు కనీసం సగం రోజులైనా రాజ్యాధికారం వస్తుందని ఆ సామాజికవర్గం ప్రజలు బలంగా నమ్ముతున్న పరిస్థితి! అయితే మారిన పరిణామాల నేపథ్యంలో… వారిలో నెలకొన్న సందిగ్దతలను తొలగించేందుకు పవన్ రంగంలోకి దిగల్సిన ఆవశ్యకత బలంగా ఏర్పడింది.

ఏపీలో టీడీపీ – జనసేన కూటమి అధికారంలోకి వస్తే సీనియర్ కం సమర్ధుడు అయిన చంద్రబాబే ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉంటారని నారా లోకేష్ ఏ క్షణమైతే ప్రకటించారో.. అప్పటినుంచి జనసేనలో పైకి కనిపించనట్లు ఉన్న ఒక ఆందోళన నెలకొందనేది మాత్రం సుస్పష్టం. వాస్తవానికి టీడీపీతో పొత్తు ప్రకటన చేసినప్పుడే.. జనసేన నుంచి పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. స్థానికంగా బలమైన నేతలుగా ఉన్న వారు రాజీనామా లేఖలు సమర్పించారు.

అయితే నాడు వారి వెర్షన్ వినేందుకు కనీ… తద్వారా వారిని బుజ్జగించేందుకు కానీ జనసేన అధినాయకత్వం ప్రయత్నాలు చేయలేదనేది బలంగా వినిపించిన కామెంట్. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించాయి. సొంతబాలాన్ని కాపాడుకోకుండా.. పక్కోడి భుజానికి భుజం ఆన్నిచ్చి ఎంతకాలం బ్రతుకుతామ అనే కామెంట్లు వినిపించాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.

టీడీపీతో జనసేన పొత్తు అనంతరం నేతలు బయటకు పోతే… సీఎం సీటు చంద్రబాబుకే అని లోకేష్ ప్రకటించిన అనంతరం కేడర్ లో మౌనం అలుముకుంది. ఎవరికి వారు మౌనంగానే నియోజకవర్గాల్లో నడుచుకుంటున్నారు. టీడీపీ కార్యకార్తలతో సఖ్యత బీటలు వారుతుందనే మాటలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో పవన్ కచ్చితంగా దిగిరావాల్సిన సమయం ఆసన్నమైంది.

నాయకులను, కేడర్ ను కలుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో… ముసుగులో గుద్దులాటలు ఆడుతూ.. కేడర్ ని కన్ ఫ్యూజన్ లో పెడుతూ ఏదో అలా జరిగిపోద్దిలే అనే రాజకీయం ఇప్పుడు పనికి రాదు! స్పష్టత చాలా ముఖ్యం!! దీంతో పవన్ ఈ నెల 28, 29, 30 లో ఆ పార్టీకి అత్యంత కీలకమైన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

మూడు రోజులపాటు కాకినాడ, రాజమండ్రిలో బసచేసి నాయకులతో సీట్ల సర్ధుబాటు విషయంలో తనకున్న క్లారిటీ, తనకు వచ్చిందని చెబుతున్న హామీపై ఒప్పించే పనికి పూనుకోబోతున్నారని తెలుస్తుంది. అదంతా ఒకెత్తు అయితే… కేడర్ కి మాత్రం సీఎం సీటు విషయంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా కాకుండా… ఉన్నవాళ్లు ఉండండి.. తనను ఎవరైనా ప్రశ్నిస్తే వారు వైసీపీ కోవర్టులుగా తాను భావించాల్సి వస్తుంది వంటి మాటలు మాట్లాడితే… 2019 రిపీట్ అయ్యే ప్రమాదం లేకపోలేదు!

మరి తాజాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో మొదలుపెట్టిన మూడు రోజుల కీలక సమావేశాల్లో… పవన్ కల్యాణ్ ఒక మెట్టూ దిగి వచ్చి అటు నాయకులను, ఇటు కేడర్ ను కూల్ చేసి, క్లారిటీ ఇస్తారా.. లేక, తనదైన పంథాలోనే ముందుకుపోతారా అన్నది వేచి చూడాలి!! రెండోదే జరిగితే మాత్రం… మరింత మంది నేతలు, కేడర్ పార్టీకి దూరం.. దూరం.. కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు!