సినిమాల్లో బిజీగా వున్న పవన్ కళ్యాణ్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా ఏపీ పొలిటికల్ తెరపై కనిపించని జనసేనాని, అనూహ్యంగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు సంసిద్ధమయ్యారు. రేపే తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు.
అకాల వర్షాలతో రైతులు పంట నష్టపోయిన మాట వాస్తవం. ప్రభుత్వం వారిని ఆదుకుంటామంటోంది. కానీ, ఆదుకుంటున్న పరిస్థితులు కనిపించడంలేదు. ‘ఆదుకోండి మహాప్రభో..’ అని రైతులు నెత్తీ నోరూ బాదుకుంటోంటే, ‘ఎర్రి పప్ప..’ అంటూ ఓ రైతు మీద విరుచుకుపడిపోయారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
పైగా, ఆ ‘ఎర్రిపప్ప’ అనే బూతు మాటకి ఓ పిచ్చి అర్థం చెప్పి, మంత్రి కారుమూరి వివాదాన్ని మరింత రాజుకునేలా చేశారు. సరిగ్గా ఈ సమయంలోనే, ‘రేపు తూర్పుగోదావరి జిల్లాలో జనసేనాని పర్యటన’ అంటూ జనసేన పార్టీ నుంచి ప్రకటన వచ్చింది.
రైతుల కోసం జనసేనాని చాలా చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున (ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు) సాయం చేస్తున్నారు జనసేనాని.
అయితే, ఈ మధ్య ఆ కార్యక్రమానికి కాస్త విరామం ప్రకటించినట్లున్నారు. రైతుల్లో మాత్రం జనసేనాని పట్ల కొంత సానుకూలత వుంది. మంత్రి కారుమూరి వ్యాఖ్యల నేపథ్యంలో పెరిగిన పొలిటికల్ హీట్‌ని క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు జనసేనాని. మంత్రి కారుమూరికి జనసేనాని కౌంటర్ ఎటాక్ ఇవ్వడం ఖాయమే.!