విషాదంగా మారిన ఆలయ రథోత్సవం.. కరెంట్ షాక్‌తో 11 మంది సజీవదహనం…

అప్పటి వరకూ కోలహాలంగా సాగిన రథోత్సవంలో ఒక్కసారిగా హహాకారాలు, రోధనలు మిన్నంటాయి. ఊరేగింపు పూర్తయి మరికొద్ది సేపట్లో రథం ఆలయానికి చేరుకుంటుందనగా.. ఓ మలుపు వద్ద హైటెన్షన్ వైర్లు రథాన్ని తాకాయి. అంతే, దానికి సమీపంలో ఉన్న పదుల సంఖ్యలో భక్తులు కరెంట్ షాక్‌కు గురయ్యారు. మంటలు వ్యాపించి రథం బూడిదకాగా.. పలువురు అగ్నిప్రమాదానికి ఆహుతయ్యారు. ఊహించని ఈ పెను విషాదం తమిళనాడులోని తంజావూర్ అప్పార్ ఆలయంలో సంభవించింది.

ఈ ఘటనలో 11మంది భక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం తంజావూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. విద్యుదాఘాతం జరిగిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగి రథం కాలి బూడిదయ్యింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.