కరోనా పాండమిక్ నేపథ్యంలో రాష్ట్రాలు ఆర్థిక ఇబ్బందుల్లో వున్నమాట వాస్తవం. అయితే, ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థలు గాడిన పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మాత్రం రోజు రోజుకీ మరింత దిగజారుతోంది. అప్పులు.. కొత్త కొత్త అప్పులు.. చిత్ర విచిత్రమైన అప్పులు చేయాల్సిన దుస్థితి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తోంది.
సెక్యూరిటీ బాండ్ల వేలం, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, తనఖా.. ఇలా నడుస్తోంది పరిస్థితి. చంద్రబాబు హయాంలో అప్పులు జరిగాయి.. అంతకు ముందూ అప్పులు జరిగాయి.. కానీ, వాటితో పోల్చితే, ఇప్పుడు జరుగుతున్న అప్పులు మరీ దారుణం.
‘సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నాం.. రాష్ట్ర ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నాం.. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా చేస్తున్నాం..’ అని ప్రభుత్వం చెప్పే మాటల్లో విశ్వసనీయత క్రమక్రమంగా తగ్గిపోతోంది. ఎందుకంటే, అవతల అప్పుల కొండ పెరిగిపోతోంది.. అనూహ్యంగా పెరిగిపోతూ భయపెడుతోంది.
ఎన్నాళ్ళిలా అప్పులు చేసుకుంటూ వెళతారు.? కానీ, తప్పదు. తగిన ఆదాయం లేకుండా రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. అందుకే, అప్పులతో రాష్ట్రాన్ని నడిపించాల్సి వస్తోంది వైఎస్ జగన్ సర్కారుకి. మొత్తంగా ఆరు లక్షల కోట్ల అప్పు ప్రస్తుతం రాష్ట్రానికి వుందన్నది ఓ అంచనా.
మరి, అప్పులకు వడ్డీల మాటేమిటి.? ప్రస్తుతానికి దాదాపు అర లక్ష కోట్లదాకా.. అంటే, 40 వేల కోట్లు దాటి 50 వేల కోట్లకు వడ్డీ చేరుకుంటున్నట్లుగా వార్తలు వినవస్తున్నాయి. వీటన్నిటి భారం మోసేది అంతిమంగా ప్రజలే. ఈ అప్పుల ప్రచారంపై అధికార పార్టీ ఎంతగా విపక్షాల్ని ఆడిపోసుకుంటున్నా.. జరగాల్సిన డ్యామేజీ అయితే వైసీపీకి జరిగిపోతోంది.