ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఆంధ్రపదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందన్నది నిర్వివాదాంశం. ‘చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా అప్పులు చేశారు. మేం బాధ్యతాయుతంగా అప్పులు చేస్తున్నాం. నిజమే, మేం అప్పులు ఎక్కువే చేస్తున్నాం. కానీ, మంచి ఆలోచనతో అప్పులు చేస్తున్నందుకు గర్వపడుతున్నాం’ అని ఇటీవల ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పుకున్నారు. చంద్రబాబు హయాంలో కూడా అప్పటి ఆర్థిక మంత్రి ఇలాగే చెప్పారు.
ఏ ప్రభుత్వమైనా, తాము అడ్డగోలుగా అప్పులు చేశామని ఒప్పుకుంటుందా.? ఒప్పుకోదు. అంతిమంగా అప్పులకు వడ్డీలు సైతం కట్టాల్సింది ప్రజలే. ప్రజలెలా కడతారు.? మాకేంటి సంబంధం.? అని సాధారణ ప్రజానీకం అనుకోవచ్చుగాక. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు వ్యక్తులకు వెళ్ళిపోవడం, పన్నులు పెరగడం.. ఇలాంటివన్నీ జరుగుతాయి.. అప్పులు తీర్చడానికి. కాదు కాదు, అప్పుల తాలూకు వడ్డీలు కట్టడానికి. సమీప భవిష్యత్తులో ఆంధ్రపదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి కోలుకునే అవకాశమైతే కనిపించడంలేదు. రెండేళ్ళపాటు పూర్తిగా సంక్షేమం మీదనే జగన్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అనుకోకుండా కరోనా వైరస్ వచ్చిపడింది. దాంతో, ఆర్థికంగా అసలు పుంజుకోవడానికే లేకుండా పోయింది. గడచిన రెండేళ్ళలో ఏడాది కాలం కరోనా కాటుకే బలైపోయిన మాట వాస్తవం. కారణాలు వెతుక్కుంటూ పోతే, సమస్యకు పరిష్కారం దొరకదు. ప్రతి నెలా అప్పు చేస్తేనేగానీ ప్రభుత్వం నడవని పరిస్థితి వచ్చేసింది. అప్పులు కొత్తగా ఎక్కడ పుడతాయోనని ఎదురుచూడాల్సిన దుస్థితి అంటే అంతకన్నా బాధాకరం ఇంకేముంటుంది.? ‘చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాన్ని నిండా ముంచేసింది.. అప్పులు చేసి కూడా, వాటిని సద్వినియోగం చేయలేదు..’ అని ఎక్కువ కాలం వైసీపీ విమర్శలు చేయడానికి వీల్లేదు. అంతిమంగా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా వుండాలి.