ఎట్టకేలకు కత్తి మహేష్‌ని తమ మద్దుతుదారుడిగా ఒప్పుకున్న వైసీపీ

Finally YSRCP Says Kathi Mahesh Is Their Supporter

Finally YSRCP Says Kathi Mahesh Is Their Supporter

సినీ విమర్శకుడు కత్తి మహేష్ తమ పార్టీ మద్దతుదారుడని ఎట్టకేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంది. పార్టీ పరంగా కత్తి మహేష్ కుటుంబానికి అండగా వుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి కత్తి మహేష్ టిక్కెట్ ఆశించిన మాట వాస్తవం. అందుకోసమే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, విపరీతమైన పబ్లిసిటీ స్టంట్లు చేశారు కత్తి మహేష్. ఇటీవల నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేష్, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

కత్తి మహేష్, వైసీపీ సానుభూతిపరుడైనప్పుడు.. పార్టీ నుంచి ఆర్థిక సాయం ఆయన వైద్య చికిత్సకు అందించి వుంటే బావుండేదన్న డిమాండ్లు వైసీపీ సానుభూతిపరుల నుంచే వ్యక్తమయ్యాయి. అయితే, ప్రభుత్వ ఖజానా నుంచి.. అదే, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి కత్తి మహేష్ వైద్యం కోసం 17 లక్షలు విడుదల చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. చేస్తున్నది మంచి పనే అయినా, కత్తి మహేష్ కోసం ఇంత మొత్తం విడుదల చేయడమేంటన్న విమర్శలు ప్రభుత్వం మీద వచ్చాయి.

ఇదిలా వుంటే, వైసీపీ జెండా కప్పుకోకుండా సినీ విమర్శకుడి ముసుగులో, దళిత ముసుగులో తమ అధినేత మీద అడ్డగోలు విమర్శలు కత్తి మహేష్ చేశారనీ, అతని వెనుక వైసీపీ వుందన్న తమ వాదన నిజమని ఇప్పుడు తేలిందనీ జనసేన మద్దతుదారులు అంటున్నారు. అయితే, చనిపోయిన వ్యక్తి చుట్టూ ఇంకా రాజకీయం నడవడం అస్సలేమాత్రం సమంజసం కాదు. బతికుండగా కత్తి మహేష్‌ని తమ పార్టీ మద్దతుదారుడని చెప్పుకోలేకపోయిన వైసీపీ, ఆయనతో ఎన్నికల ప్రచారం చేయించుకునీ.. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన్ని ఆదుకోలేకపోయిందన్న విమర్శల్ని ఎదుర్కొంటోంది.