పేరులో’ ఏముంది.? అంటే, బోల్డంత వుంది. ఓ మంత్రి ఇల్లు తగలబడేంత వివాదం వుంది. ఓ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టేంత రచ్చ దాగి వుంది.! ఆర్టీసీ బస్సులు తగలబడేంత రాజకీయం కూడా వుంది. కోనసీమ జిల్లాలో రేగిన అలజడి గురించి కొత్తగా చెప్పేదేముంది.?
అధికార పక్షం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితమే, కోనసీమ ‘మంట’కి కారణం. కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై ఎక్కడా తీవ్ర అభ్యంతరాలు రాలేదు. కోనసీమ జిల్లా పేరు మార్చాలని వైసీపీ సర్కారుకి ఎందుకు అనిపించిందోగానీ, అదే.. ఆ ఆలోచనే ‘అగ్గి’ రాజేసింది.
అరెస్టుల పర్వం ఓ పక్క కొనసాగుతోంది. ఇంతలోనే, కోనసీమ జిల్లాకి కొత్త పేరు వచ్చిపడింది. ఏ పేరు వద్దంటూ ఆందోళనలు జరిగాయో, ఆ పేరే ఖరారు చేసింది వైసీపీ సర్కారు. అసలు, ఆ పేరు వద్దన్నారా.? కోనసీమలో అలజడికి కారణమేంటి.? అన్నదానిపై ఇప్పటికీ భిన్న వాదనలు వినిపిస్తూనే వున్నాయి.
కోనసీమ అన్న పేరు, అక్కడి ప్రజల సెంటిమెంటు. కోనసీమ అనే పేరు.. కోనసీమ వాసుల ఆత్మగౌరవం.. ఇలా చాలా చాలా ప్రస్తావనలు నడిచాయ్. ఏం మారిందని.? డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ అయ్యిందిప్పుడు. రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు మాత్రమే అదనంగా చేరింది.
రాష్ట్రంలో ఏ జిల్లాకీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనే పేరు పెట్టాలనిపించలేదు వైసీపీ సర్కారుకి. చిత్రంగా కోనసీమ జిల్లా విషయంలోనే ఎందుకీ పేరు.? అని విపక్షాలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఎలాగైతేనేం, వివాదం సద్దుమణిగితే అంతకన్నా కావాల్సిందేముంది.?