సైబర్ క్రైమ్‌కి అనసూయ భరద్వాజ్ ఫిర్యాదు.! వాట్ నెక్స్‌ట్.!

తన మీద భయంకరమైన ట్రోలింగ్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోలింగ్‌పై అనసూయ భరద్వాజ్, సోషల్ మీడియా వేదికగానే ట్రోలింగ్ చేసేవారికి కౌంటర్ ఎటాక్ ఇస్తూ వచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో అత్యంత జుగుప్సాకరంగా తనని తిడుతున్నవారికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకుంది. ఆ విషయాన్ని ఆమె ఇప్పటికే నెటిజన్లకు తెలియజేస్తూ హెచ్చరించింది కూడా.

అయినా, ‘ఆంటీ’ అంటూ అనసూయ మీద ట్రోలింగ్ ఆగలేదు. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ తీసుకెళ్ళి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అనసూయ తాజాగా పేర్కొంది. సోషల్ అబ్యూజ్ మీద తన పోరాటం విజయవంతమవుతుందనే నమ్మకాన్ని అనసూయ వ్యక్తం చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు, ఫిర్యాదు విషయంలో తనకు సహకరించినట్లు కూడా పేర్కొంది అనసూయ.

వాట్ నెక్స్‌ట్.? సోషల్ అబ్యూజ్ అనేది సినీ, టీవీ సెలబ్రిటీలకే కాదు, రాజకీయ నాయకులకీ తప్పడంలేదు. ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు సైతం, ఈ సోషల్ వేధింపుల్ని ఎదుర్కొంటున్నారు.

లక్షలాది మంది, కోట్లాది మంది నెటిజన్లున్న మన దేశంలో.. ఎంతమందిని సైబర్ క్రైమ్ విభాగం అరెస్టు చేయగలుగుతుంది.? అన్నది కీలకమైన ప్రశ్న ఇక్కడ.

ముఖ్యమంత్రి మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ నిత్యం రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీల అభిమానులు అరెస్టవడం తెలుగు రాష్ట్రాల్లో చూస్తూనే వున్నాం. ఇలా అరెస్టయి, అలా బెయిల్ మీద విడుదలైపోతున్నారు చాలామంది. చాలా కేసుల్లో న్యాయస్థానాలు పోలీసులకే మొట్టికాయలేస్తున్న వైనం కూడా కనిపిస్తోంది.

మరి, అనసూయ ఫిర్యాదు విషయంలో ఏం జరగబోతోంది.? నిజానికి, ఇది నైతికతకు సంబంధించిన విషయం. నైతిక విలువల్లేని సమాజంలో, చట్టాలు.. అరెస్టులు.. శిక్షలు.. మనుషుల్ని మార్చుతాయని ఎలా అనుకోగలం.?