రైతుల ఆత్మహత్యలు: ప్రధాని మోడీని పవన్ ప్రశ్నించగలరా.?

రైతుల ఆత్మహత్యల విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా, చాలా చాలా గట్టిగా ప్రశ్నించేస్తున్నారు. నిజమే, రైతుల ఆత్మహత్యల విషయమై ప్రభుత్వాల్ని ప్రశ్నించాల్సిందే. అధికారంలో వున్నవారిని విపక్షాలే కాదు, ప్రజలూ ప్రశ్నించాలి. ఎందుకంటే, రైతు లేకపోతే.. మనిషి మనుగడే లేదు.

ఎంత సాఫ్ట్‌వేర్ రంగంలో దూసుకెళుతున్నా, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నా.. ఏ మనిషి అయినా, తినాల్సింది ఆహారమే. అది పండించేవాడే రైతు. ఆ రైతుకే మనుగడ లేకపోతే, మానవాళి మనుగడెక్కడుంటుంది.? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ, ఆ మాటకొస్తే.. దేశవ్యాప్తంగా రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ప్రకృతి విపత్తులు, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుల మందులు.. ఇలా చెప్పుకుంటూ పోతే, రైతుపై ముప్పేట దాడి జరుగుతోంది. అన్నటికీ మించి ప్రభుత్వాలు, రైతుల్ని ఆదుకోవడంలో విఫలమవుతున్నాయి. అదే అతి పెద్ద సమస్య. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా వున్న పరిస్థితి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశతో వున్నారు గనుక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేవలం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మాత్రమే నిలదీస్తున్నారు. ‘జాతీయ భావాలు కలిగినవాడ్ని నేను..’ అని పవన్ చెప్పకుండా వుండి వుంటే, ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సరిపోతుంది.

జాతీయ భావాలున్నవాడినని చెబుతుంటారు గనుక, తెలంగాణ ప్రభుత్వాన్నీ ప్రశ్నించాలి, కేంద్రంలో అధికారంలో వున్న మోడీ ప్రభుత్వాన్నీ ప్రశ్నించాలి. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితితో చిత్ర విచిత్రమైన స్నేహం కొనసాగుతోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి. బీజేపీ అయితే, జనసేనకు మిత్రపక్షం. అద్గదీ అసలు సంగతి. అందుకే, జనసేనాని ప్రశ్నకు విలువ లేకుండా పోతోంది.